ప్రజస్వామ్యంలో ఓటు విలువ ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ఓటుతో ప్రభుత్వాల తలరాతని మార్చవచ్చు. ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ఓటు హక్కుని వినియోగించుకునే విషయంలో కొందరు అలసత్వం వహిస్తున్నారు. దీని వల్ల ఓటింగ్ శాతం ఎక్కువ స్థాయిలో రావడం లేదు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఓట్లు తక్కువ పడుతున్నాయి. అంటే ఉద్యోగాలు చేసేవారు..చదువుకున్న వారే ఓటు వేసే విషయంలో వెనుకబడి ఉన్నారు.
అందుకే అలాంటి వారికి ఎక్కడా ఉన్నా సరే ఓటు హక్కు వినియోగించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం రిమోట్ ఓటింగ్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తమ సొంత నియోజకవర్గాల్లో, ఎన్నికల సమయానికి భౌతికంగా ఉండలేని వ్యక్తులు కూడా దేశంలోని ఇతర ప్రాంతాల్లోంచి అయినా ఓటు వేయడానికి అవకాశం కల్పించడమే ఈ రిమోట్ ఓటింగ్ విధానం. ఉదాహరణకు హైదరాబాదుకు చెందిన ఓటరు విజయవాడలో పనిచేస్తుంటే గనుక.. ఎన్నికల పోలింగ్ రోజున విజయవాడలోనే పోలింగ్ బూత్‌కు వెళ్లి.. హైదరాబాదులోని తన ఓటు వినియోగించుకోవచ్చు. అయితే ఈ విధానాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఈ పద్ధతి వద్దే వద్దు అని కాంగ్రెస్ అంటుంది. దీనిలో అక్రమాలు జరగవచ్చని ఆరోపిస్తుంది. అటు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా రిమోట్ ఓటింగ్ వద్దంటున్నారు. అయితే ఆయన పూర్తి అవగాహన లేకుండానే.. విదేశాల్లో కూర్చుని ఓటు వేసే పద్ధతి మంచిది కాదని అంటుండడం విశేషం. ఈవీఏంలు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రిమోట్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
అటు ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మాత్రం రిమోట్ ఓటింగ్ మెషీన్‌ను స్వాగతిస్తున్నామని వెల్లడించారు. అయితే ఈసీ అనుసరించిన విధానం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని, పార్టీల అభిప్రాయాలు స్వీకరించకుండానే ఆర్వీఎమ్ తీసుకొచ్చారని, రాజకీయ పక్షాల ఏకాభిప్రాయం తర్వాతనే ఆర్వీఎమ్ అమలు చేయాలని స్పష్టం చేశారు. మొత్తానికి ఈ రిమోట్ ఓటింగ్ పై రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. మరి చివరికి ఈ విధానం అమలవుతుందో లేదో చూడాలి.