తెలంగాణలో త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో అధికారులు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసారు. రాష్ట్రంలో శాఖల వారిగా ఖాళీలపై కసరత్తు మొదలెట్టారు. ఈ మేరకు ఆదివారం చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీహెచ్‌ఆర్డీ)లో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలో మొత్తం 55 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు (Government job vacancies) ఉన్నాయని వివిధ శాఖల అధికారులు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి నివేదించారు. పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య, సంక్షేమం, రెవెన్యూ శాఖల్లో అధికంగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని ప్రభుత్వ శాఖలు పేర్కొన్నాయి.
నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం అధికారులు ఖాళీల్లో జిల్లా, జోన్, బహుళజోన్ల వారీగా పోస్టుల వివరాలను అందజేశారు. కాగా వివిధ శాఖలు ఇచ్చిన నివేదికను ఆర్థిక శాఖ సోమవారం క్రోడీకరించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందించనుంది. ఈ వివరాలను సీఎస్, సీఎం కేసీఆర్ కు అందజేయనుండగా… జులై 13న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో మంత్రిమండలి ఈ ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
కారుణ్య నియామకాలను ఈ ఖాళీల జాబితా నుండి మినహాయించారు. ఆకస్మిక మరణాలు, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ పొందిన వారి వారసులకు త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నిరుద్యోగులకు వెసులుబాటు కల్పించేలా క్రమంగా ఒక శాఖ తర్వాత మరో శాఖలో ఖాళీలను భర్తీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అన్ని అనుకూలించి ఉద్యోగాల భర్తీకి జులై 13న మంత్రిమండలి ఆమోదం తెలిపితే త్వరలోనే నోటిఫికేషన్‌లు జారీ అయ్యే అవకాశం ఉంది.