218 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా అరుదైన గుర్తింపు

-

తమిళనాడుకు చెందిన ఎన్నికల వీరుడు పద్మరాజన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు దక్కింది. కాగా సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని ఎరటై పులియ మరత్తూరుకు చెందిన పద్మరాజన్ (62) 1988 నుంచి ఏ ఎన్నిక జరిగినా పోటీ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికి ఆయన అన్ని ఎన్నికల్లో కలిపి 218సార్లు ఆయన నామినేషన్ వేసి రికార్డు సృష్టించారు.

తాజాగా తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎడపాడి నియోజకవర్గం నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామిపై కూడా పోటీకి దిగారు. అలానే కేరళ ఎన్నికల్లో కూడా పోటీ చేసారు. ధర్మడం నియోజకవర్గం నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రత్యర్థిగా నామినేషన్ వేసారు. అలానే గతంలో ఆ రాష్ట్రంలో జరిగిన సహకార సంఘాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ ఎన్నికల్లో కూడా నామినేషన్లు వేశారు. అంతకుముందు ఓ సారి రాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ వేశారు. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికలు జరిగినా నామినేషన్‌ వేయడంలో పద్మరాజన్‌ ముందుంటారు. అయితే పద్మరాజన్‌ ఇన్ని సార్లు నామినేషన్ వేసినా ఒక్కసారి వార్డు సభ్యుడిగా కూడా గెలవకపోవడం గమనార్హం.

అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎన్నికల వీరుడికి ఓ అరుదైన గుర్తింపు లభించింది. ప్రతి ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు గాను ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డు ఆయన్ను గుర్తించింది. తమ బుక్‌ ఆఫ్‌ రికార్డులో పద్మరాజన్‌కు చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి పద్మరాజన్‌కు సర్టిఫికెట్‌ను కూడా పంపించారు. అత్యధిక సార్లు ఓటమి పాలైన అభ్యర్థిగా ఆయనకు ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా దీనిపై స్పందించిన పద్మరాజన్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డులో తన పేరు నమోదవడమే లక్ష్యం అని పేర్కొన్నాడు. అప్పటివరకు వరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news