రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి , పాలమూరు ఎత్తిపోతల పనులు త్వరలో పూర్తికానున్నాయని, వీటి ద్వారా రైతులకు సాగునీరందించి దశాబ్దాల నాటి కలను నెరవేర్చనున్నామని పేర్కొన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం తెల్కపల్లి మండల బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలు సాగుఅవుతాయని తెలిపారు. ‘ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టగానే అటు ఆంధ్రా ప్రభుత్వం, ఇటు తెలంగాణ ఇంటి దొంగలు 190 రకాల కేసులు వేశారు.ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు మేలు జరిగితే తమకు రాజకీయంగా పుట్టగతులుండవని అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రాజెక్ట్ మొదలుపెట్టి కేవలం మూడేళ్లలో కాళేశ్వరం ఎత్తిపోతల పూర్తి చేసిన ఏకైక మొనగాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పొగిడారు. భాషా, సంస్కారం లేని వాళ్లు ప్రతి రోజూ కేసీఆర్ ను విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. పేదల డబ్బు దోచి పెద్దలకు, కార్పొరేట్లకు దోచిపెడుతున్న వారు కేంద్రాన్ని ఏలుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతదితరులు హాజరయ్యారు.