ఎన్నికలు అయినప్పటి నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు షాకులు ఆగడం లేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడమే కాదు.. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన నేతలు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు, మాజీ జడ్పీచైర్మన్లు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు ఇతర కీలక నామినేటెడ్ పదవులు చేపట్టిన వారంతా వరుసగా సైకిల్ దిగేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారిలో ఆదినారాయణ రెడ్డి, సిద్ధా రాఘవరావు, చలమలశెట్టి సునీల్, బీద మస్తాన్‌రావు లాంటి నేతలు ఇప్పటికే పార్టీ మారిపోయారు. ఇక వైజాగ్‌ను జగన్ ఎప్పుడు అయితే పరిపాలనా రాజధానిగా ప్రకటించారో అప్పటి నుంచి ఉత్తరాంధ్రలో టీడీపీ కంచుకోటలు ఒక్కొక్కటిగా బీటలు వారుతుండగా… ఒక్కో కీలక నేత జంప్ చేసేస్తున్నాడు.
తాజాగా ఈ లిస్టులో వినిపిస్తోన్న పేరు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుది. పల్లా ఫ్యామిలీ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండేది. ఆయన తండ్రి పల్లా సింహాచలం. తండ్రి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న పల్లా టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. 2009లో వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ ఆ తర్వాత గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డిపై తలపడి ఓడిపోయారు.
ఈ సీటు విషయంలో పవన్‌ను గెలిపించేందుకు చంద్రబాబు పల్లాను సైలెంట్ అవ్వమని చెప్పారన్న టాక్ కూడా ఉంది. జనసేనతో చేసుకున్న అంతర్గత ఒప్పందంలో భాగంగానే చంద్రబాబు గాజువాకలో ప్రచారం చేయకపోవడంతో పాటు చివర్లో నిధులు కూడా ఇవ్వలేదని ఆయన కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. తాను ఓడిపోవడానికి ఓ విధంగా చంద్రబాబే కారణమని ఆయన సన్నిహితులతో వాపోయారట. పైగా పల్లా మాజీ మంత్రి గంటా బ్యాచ్. ఆయన గంటాతో పాటు ఎటైనా వెళ్లిపోవచ్చంటున్నారు. ఇప్పటికే గంటా అనుచరులు ఒక్కొక్కరు వైసీపీలో చేరుతున్నారు.
ఈ క్రమంలోనే పల్లా వైజాగ్ రాజధాని ఏర్పాటును స్వాగతించడంతో పాటు అదే టైంలో ఇక్కడ రాజధాని నిర్ణయానని టీడీపీ వ్యతిరేకిస్తుండడంతో దానిని సాకుగా చూపి ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారట. ఏదేమైనా పల్లా పార్టీ వీడడం వైజాగ్‌లో చంద్రబాబుకు, టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బే. ఇక ఆయన వైసీపీలో చేరితే విశాఖ మేయర్ అభ్యర్థిగా ఎనౌన్స్ చేస్తారని.. ఈ మేరకు ఒప్పందం కుదరడంతో ఆయన అడుగులు వైసీపీ వైపే ఉన్నాయంటున్నారు.
-vuyyuru subhash