మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా తెలుగులో నటించిన ప్రేమకథా చిత్రం ‘సీతా రామం’. ఈ ప్రేమ కథా చిత్రంలో హీరోహీరోయిన్ల నటనకు సినీప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా హిట్ టాక్‌తో ఈ మూవీ తెలుగురాష్ట్రాల్లో అన్నిచోట్ల మంచి వసూళ్లు సాధించింది. ఇటీవల ఓటీటీలో కూడా ఈసినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈసినిమాపై పరుచుూరి గోపాలకృష్ణ తన రివ్యూను తెలిపారు.
పరుచూరి పాఠాల ద్వారా తాజా సినిమాలపై తన అభిప్రాయం చెబుతున్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణతాజాగా ఆయన ‘సీతారామంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హృద్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం సాధించిన ఈ చిత్రం తనకూ నచ్చిందని ఆయన తెలిపారు. విభిన్న పార్శ్వాలను స్పృశించే ప్రేమ, ఆకట్టుకునే యుద్ధ నేపథ్యం, ప్రేక్షకుల మదిలో అలజడి రేపే విషాదాంతంలాంటి అంశాలు సినిమాను మరుపురాని చిత్రంగా నిలబెట్టాయన్నారు.
గతంలో ఇదే నేపథ్యంతో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని, కమర్షియల్‌గానూ విజయం సాధించాయని పరుచూరి తెలిపారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్, ప్రీతీ జింటా, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించిన వీర్‌జారా చిత్రం కూడా ఇదే కథాంశం అని ఆయన గుర్తు చేశారు. కానీ సగటు ప్రేక్షకుడు ఆశించే సుఖాంతానికి తావివ్వకుండా, దర్శకుడు సినిమాని విషాదాంతంగా ముగించడంతో ‘సీతారామం’ భిన్నమైన ప్రేమకథ చిత్రంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే క్లైమాక్స్‌లో వాళ్లిద్దరూ కలిసినట్లు సినిమాని మార్చి ఉంటే వేరే లెవెల్లో ఉండేదని, హీరో పాత్రను ప్రశ్నార్థకంగా ముగించేయడం ప్రేక్షకులను కంటతడి పెట్టించిందని ఆయన తెలిపారు.
ఏదేమైనా చక్కని ప్రేమకావ్యం తీయడంలో దర్శకుడు హను రాఘవపూడి కృతార్థుడయ్యాడని పరుచూరి ప్రశంసించారు. ఇంకా ఈ చిత్రంలో నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక తమ నటనతో సన్నివేశాలను రక్తి కట్టించారని ఆయన తెలిపారు. తక్కువ నిడివి ఉన్న పాత్రలకు సైతం పెద్ద నటులను తీసుకుని, ఏ మాత్రం రాజీపడకుండా ఉన్నత విలువలతో సీతారామంను నిర్మించిన అశ్వనీదత్, ఆయన కుమార్తెలను అభినందించాల్సిందేనని పరుచూరి అన్నారు