నిజామాబాద్‌ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తిని లాగుతూ తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ వీడియోపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ స్పందించారు. ఆ వీడియోలో ఉంది ఆస్పత్రి సిబ్బంది కాదని.. రోగితో వచ్చిన సహాయకులు అని స్పష్టం చేశారు.
మార్చి 31న సదరు రోగి ఆసుపత్రికి వచ్చారన్న సూపరింటెండెంట్.. అత్యవసర విభాగంలో పరీక్షల అనంతరం జనరల్‌మెడిసిన్‌విభాగానికి వెళ్లాలని సూచించారని తెలిపారు. రోగులు వేచి ఉండే హాలులో బెంచ్‌పైన కూర్చోబెట్టి…పేషెంట్‌కేర్‌సిబ్బంది చక్రాల కుర్చీ తెచ్చేలోపే వారి తల్లిదండ్రులు లాక్కెళ్లారని డాక్టర్ ప్రతిమారాజ్ వివరణ ఇచ్చారు. వీల్ చైర్‌లోనే సిబ్బంది తీసుకెళ్లారని తెలిపారు. సిబ్బంది పట్టించుకోలేదనడం అవాస్తవమన్న డాక్టర్.. లిఫ్ట్ వచ్చిందన్న తొందరలో సహాయకులే లాక్కెళ్లారని పేర్కొన్నారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వారించి తదుపరి చక్రాల కుర్చీలో తీసుకెళ్లారని తెలిపారు