స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో రేపు, ఎల్లుండి చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. అయితే.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీబీఐ దర్యాప్తును కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. అయితే, చంద్రబాబు కేసును సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరడం పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు కోరుతున్న ఉండవల్లి… మద్యం స్కాంపై ఎందుకు సీబీఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. రాజమండ్రి చుట్టూ ఎన్ని అక్రమ ఇసుక రీచ్ లు ఉన్నాయో ఉండవల్లి అరుణ్ కుమార్ కు తెలియదా? అంటూ పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేతలు చేస్తున్న భూకబ్జాలపై ఎందుకు మాట్లాడడంలేదు? ఎవరో తయారు చేసిన పిటిషన్ పై మీరు సంతకం చేశారా? అని ఉండవల్లిని నిలదీశారు. చంద్రబాబు అరెస్ట్ కక్షపూరితంగానే జరిగిందన్న పట్టాభి… ఉండవల్లి తన పిటిషన్ లో ప్రేమ్ చంద్రారెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. నిజానిజాలు తెలిసి కూడా నటించవద్దని ఉండవల్లిని కోరుతున్నా… మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి అని స్పష్టం చేశారు.