జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో బస్సు యాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే.. వాస్తవానికి దసరా నుంచి పవన్ బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. అది కార్యరూపం దాల్చలేదు. కాగా, పవన్ బస్సుయాత్రకు ఉపయోగించే భారీ వాహనం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరుపెట్టినట్టు పవన్ వెల్లడించారు. ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధమైంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈ బస్సు ఆలివ్ రంగులో చూడ్డానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తోంది. ఎంతో దృఢంగా కనిపిస్తున్న ఈ వాహనంలో పవన్ కు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు.
ఈ బస్సులో హై సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్ ను పొందుపరిచారు. కాగా, ఈ వాహనం ట్రయల్ రన్ ను పవన్ స్వయంగా పర్యవేక్షించారు. వాహనాన్ని పరిశీలించారు. అయితే.. హైదరాబాద్‌లో ఈ బస్సును రెడీ చేశారు. అయితే.. గతంలో.. ఎన్టీఆర్ చైతన్య రథాన్ని పోలి ఉంది అనే చర్చ జరిగింది. ఇప్పటి వరకూ బస్సు యాత్ర చేసిన పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేశారని చెబుతున్నారు. రెగ్యులర్ బస్‌లు, లారీలకు వాడే పెద్ద టైర్లు ఉపయోగించారు.