అడుగుకో గుంత..గజానికో గొయ్యి.. ఏపీ రోడ్లపై పవన్ కళ్యాణ్..!

ఏపీలో రోడ్ల పరిస్థితి అడుగుకో గుంత… గజానికో గొయ్యి అన్న విధంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రోడ్డు బాగు చేయమంటే వేధింపులు… లాఠీ ఛార్జీలు… అరెస్టులు చేస్తున్నారని మండి పడ్డారు. పాడైన రోడ్లను #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో చూపిద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను బాగు చేద్దామని అన్నారు. ఒక దేశం కానీ, రాష్ట్రం కానీ, ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ రహదారుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మిస్తూ, రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే.. వైసీపీ పాలనలో ఏపీ రోడ్ల వ్యవస్థ అడుగుకో గుంత… గజానికో గొయ్యిలా ఉందన్నారు.

ఇవి సరదాకు చేస్తున్న రాజకీయ విమర్శలు కాదని…నివర్ తుపాన్ సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు ప్రత్యక్షంగా దెబ్బ తిన్న రోడ్లను చూశానని అన్నారు. రోడ్ల గురించి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులతో లాఠీ ఛార్జీలు చేయించే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఒక్క నెల్లూరు జిల్లానే కాకుండా పామర్రు, గుడివాడ వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించిందన్నారు. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు గానీ, అనంతపురం నుంచి తాడిప్రతి వెళ్లే రోడ్డు… ఏ రోడ్డు తీసుకున్నా చాలా అధ్వాన్నంగా తయారయ్యాయయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు లక్షా 20వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయన్నారు. ఈ రోడ్లు దెబ్బ తిన్నా బాగు చేయడం లేదని అన్నారు. రోడ్డు గురించి అడిగితే వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్ల దుస్థితిపై పార్టీ పి.ఎ.సి. మీటింగులో చర్చించామ‌ని తెలిపారు. రోడ్లు వేస్తారేమోనని ఇంతకాలం ఎదురుచూశామ‌ని… అయితే పరిస్థితి రానురాను దిగజారిపోతుందన్నారు. ప్రభుత్వం నుంచి స్పందన తీసుకురావాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 2,3,4 తేదీల్లో రోడ్ల దుస్థితిపై #JSPFORAP_ROADS ద్వారా ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ, ఊరు బాగుకోరే ప్రతి ఒక్కరు పాడైన రోడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయాల‌ని చెప్పారు. వీటిని చూసైనా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2వ తేదీన మన రోడ్లను మనమే శ్రమదానం చేసి బాగు చేసుకుందామ‌ని పిలుపునిచ్చారు. రోడ్లను బాగు చేసే శ్రమదానం కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవుతానని ప‌వ‌న్ తెలిపారు.