నాగబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

-

నేడు కొణిదల నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఎలాంటి పరిస్థితులలోనైనా తట్టుకొని దృఢంగా నిలబడే నాగబాబు అన్నయ్యకి ఈ జన్మదిన సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ ప్రకృతి మాతను ప్రార్థిస్తున్నానని సోషల్ మీడియా వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

“చిన్నన్నయ్య శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నా జీవనయానంలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న మా చిన్నన్నయ్య, జనసేన పిఏసీ సభ్యులు శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలను విశ్లేషించుకొనేటప్పుడు- వాటి తాలూకు నేపథ్యాలను, చారిత్రక కోణాలను వాస్తవిక దృక్పథంతో అవగాహన పరచుకోవడం గురించి తెలియచెప్పింది మా చిన్నన్నయ్య శ్రీ నాగబాబు గారే. ప్రఖ్యాత న్యాయకోవిదులు శ్రీ నానీ పాల్కీవాలా గారి ఔన్నత్యాన్ని, రాజ్యాంగం, మన న్యాయ వ్యవస్థ గురించి ఆయన రాసిన పుస్తకాలను నాకు పరిచయం చేసింది శ్రీ నాగబాబు గారే.

స్వతహాగా శ్రీ నాగబాబు గారు న్యాయవాది కావడంతో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు గురించిన అంశాలపై ఆసక్తి చూపేవారు. మానవ హక్కుల ఉల్లంఘన, పర్యావరణ విధ్వంసం లాంటివాటిపై ఎక్కువగా మాట్లాడేవారు. పీడిత వర్గాల బాధలకు చలించే తత్వం ఉంది. నెల్లూరులో చదువుకొనే రోజుల్లో- చిన్నన్నయ్య మద్రాస్ హిగ్గిన్ బాథమ్స్ నుంచి తెచ్చిన ‘100 గ్రేట్ లైవ్స్’ అనే పుస్తకాన్ని ఇచ్చి తప్పకుండా చదవమన్నారు. అప్పటి నుంచి అనేక పుస్తకాలను, బాబాసాహెబ్ అంబేడ్కర్, వీర సావర్కర్, భగత్ సింగ్, టైగర్ జతిన్ దాస్, చిట్టగాంగ్ తిరుగుబాటుదారులు నుంచి జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి.. ఇలా మన సమాజాన్ని భిన్న కోణాల్లో ప్రభావితం చేసిన జీవిత గాథలను తెలిపే రచనలను, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చారు.

ముదిగొండ శివప్రసాద్ గారి చారిత్ర కల్పనా సాహిత్యం బాగా చదివేవారు. దానిపై చర్చించేవారు. గద్దర్ విప్లవ గీతాలు, కోడిబాయే లచ్చమ్మది… కోడిపుంజుబాయే లచ్చమ్మది లాంటి జానపదాల గురించి చెప్పేవారు. శ్రీ నాగబాబు గారిలో మంచి చిత్రకారుడు ఉన్నాడు. అలాగే చదువుకొనే రోజుల్లో కరాటే ప్రాక్టీస్ చేశారు. ఇప్పటికీ ఏదొక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే తపిస్తారు. ప్రకృతి వైద్యంలో చెప్పిన అంశాలను పాటిస్తారు. తేనె, నిమ్మరసం తీసుకొంటూ రోజుల తరబడి ఉంటారు.

నాస్తికవాదం, ఆస్తికత్వం… ఏదైనా హేతుబద్ధంగా ఆలోచన చేయాలంటారు. ఇలా చిన్నన్నయ్యలో భిన్న పార్స్వాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకొని ధృడంగా నిలబడే శ్రీ నాగబాబు అన్నయ్యకి ఈ జన్మదిన సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ ప్రకృతి మాతను ప్రార్థిస్తున్నాను”. అని సోషల్ మీడియా వేదిక ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news