“జై తెలంగాణ” నినాదం లాగా..వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వారం రోజుల్లో అఖిల పక్ష్యాన్ని పిలిచి..వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడాలని వైసీపీ సర్కార్ కు వార్నింగ్ ఇచ్చారు. కాసేపటి క్రితమే విశాఖలో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు సంకల్పం తో ఈ సంస్థను కాపాడుకోవాలని కోరారు. ఏ పరిశ్రమలకు నష్టాలు రావడం లేదు చెప్పండి.. అన్ని పరిశ్రమలకు నష్టాలు వస్తున్నాయన్నారు. ఒక్క వైసీపీ రాజకీయ పరిశ్రమకు తప్ప అన్నిటీకీ నష్టాలు వస్తున్నాయని చురకలు అంటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు నష్టాలు వస్తున్నాయని… ప్రైవేటీకరించాలని కేంద్రం భావించినప్పుడు కేంద్రం దగ్గరకు వెళ్ళామని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారిని కలిశామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. మీ అందరి మద్దతుతోనే నేను ముందుకెళుతున్నానని.. తనకు ఎంపీలు లేరని వెల్లడించారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని… తనకు ప్రజాబలం వుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.