రూ.6 కోట్ల దోపిడీని పట్టించిన రూ.100

-

ఆరు కోట్ల రూపాయల విలువైన బంగారం, వెండి, వజ్రాలు దోపిడీ చేసిన నిందితులు చివరకు వంద రూపాయల వల్ల పట్టుబడ్డారు. ఈ విచిత్ర ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. ఇంతకీ వంద రూపాయలు వీరిని ఎలా పట్టించిందంటే..?

సోమ్‌వీర్‌ అనే వ్యక్తి చండీగఢ్‌లోని ఓ పార్సిల్ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటారు. తన సహోద్యోగితో కలిసి బుధవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో పహాడ్‌గంజ్‌లోని సంస్థ కార్యాలయం నుంచి పార్సిళ్లను తీసుకొని వెళ్తున్నాడు. కొద్ది దూరంలో అప్పటికే ఇద్దరు యువకులు కాపు కాచి ఉన్నారు. అందులో ఒకరు పోలీసు యూనిఫాం ధరించి ఉన్నాడు. తనిఖీల పేరిట ఈ ఇద్దరిని వారు అడ్డుకున్నారు. అంతలోనే.. మరో ఇద్దరు నిందితులు వారికి జతయ్యారు. ఈ క్రమంలో దుండగులు ఉద్యోగుల కళ్లలో కారం చల్లి.. విలువైన ఆభరణాలు ఉన్న పార్సిళ్లతో పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భాగంగా ఘటనాస్థలం, పరిసరాల్లో దాదాపు 700 సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశారు.

ఈ క్రమంలోనే ఘటనాస్థలానికి సమీపంలో నలుగురు వ్యక్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించారు. వారు ఓ క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడటం కనిపించింది. అందులో ఒకరు చాయ్‌ తాగేందుకు చేతిలో డబ్బుల కోసం పేటీఎం ద్వారా క్యాబ్‌ డ్రైవర్‌కు రూ.100 ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు గుర్తించారు. ఆ లావాదేవీని విశ్లేషించగా.. నిందితులు దిల్లీలోని నజఫ్‌గఢ్‌వాసులుగా తేలింది. దోపిడీ అనంతరం వారు రాజస్థాన్‌కు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో జైపూర్‌ వెళ్లిన ఓ పోలీసు బృందం.. నగేశ్‌ కుమార్‌, శివం, మనీశ్‌ కుమార్‌లను అరెస్టు చేసింది.

వారి వద్ద నుంచి దాదాపు రూ.ఆరు కోట్ల విలువైన మొత్తం 6,270 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి, ఐఐఎఫ్‌ఎల్‌లో డిపాజిట్‌ చేసిన 500 గ్రాముల బంగారం, 106 ముడి వజ్రాలు, ఇతర వజ్రాభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరొకరిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. దోపిడీకి సూత్రధారి అయిన నగేష్.. తన స్నేహితులు, బంధువులతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డాడని డీసీపీ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news