భారీ వర్షాల కారణంగా పాకిస్తాన్ అతలాకుతలమైంది. దేశవ్యాప్తంగా వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో దేశం ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత 30 సంవత్సరాల్లో పాకిస్తాన్‌లో సగటు వర్షాపాతం రేటు 132.3 మిల్లీ మీటర్లు కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 385.4 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. దాదాపు 192 శాతం అధిక వర్షాపాతం నమోదైంది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. 3.30 కోట్ల మంది వరద ప్రభావానికి గురయ్యారు.
పాకిస్తాన్‌లో 149 వంతెలు కొట్టుకుపోగా.. 6,82,139 ఇళ్లు కూలిపోయాయని జాతీయ విపత్తు నిర్వాహణ అథారిటీ పేర్కొంది. 110 జిల్లాల్లో 57 లక్షల మందికి ఆహారం అందడం లేదు. ఆహారం కోసం ప్రజలు రోడ్లపైకి వెళ్లి దాతల కోసం పడిగాపులు కాస్తున్నారు. నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.235.98కి చేరింది. ఉల్లిధర రూ.500కి పెరిగింది. కూరగాయల ధరలు మిన్నంటాయి. దీంతో పాకిస్తాన్ భారత్ నుంచి కూరగాయలు, నిత్యావసరాలు దిగుమతి చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది.