ఏపీలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్. శుక్రవారం పేర్ని నాని తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు కుటుంబం అంతా కలిసి సెంటిమెంట్ ప్లే చేసేందుకు ప్రయత్నించిందన్నారు. ఉత్తర కుమారుడు లోకేశ్ ఏదోదో మాట్లాడుతున్నారని, కక్షతో తన తండ్రిని అరెస్ట్ చేసినట్లు విమర్శలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. అసలు చంద్రబాబు అరెస్ట్ అయ్యాక లోకేశ్ ఎక్కడ ఉన్నారు? న్యాయవాదులంతా విజయవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్ ఎక్కడ ఉన్నాడు? ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీకి వెళ్లారు? మేనేజ్ చేయడం వారికి తెలిసిన విద్యే అన్నారు.
ఇరవై ఐదు రోజులుగా ఢిల్లీలో ఎందుకు ఉన్నారు? ఎవరి కాళ్లు, చేతులు పట్టుకోవడానికి? అని నిలదీశారు. స్కిల్ స్కాంలో రూ.27 కోట్లు మీ పార్టీ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ వేషాలు ఇక్కడ వద్దని, సీమెన్స్ ఇస్తామన్న డబ్బులు ఎక్కడ? అని ప్రశ్నించారు. దొరకనంత మాత్రాన దొంగ కాకుండా పోతారా? అన్నారు. చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికారని, కానీ అప్పుడు వీరప్పన్ చెప్పిన కబుర్లు నారా లోకేశ్ చెబుతున్నారని విమర్శించారు.