ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ‘చెప్పుల’ వార్ నడుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే పేర్నినానిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండ్రోజుల క్రితం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని రెండు చెప్పులు చూపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పవన్ ‘ నా రెండు చెప్పులు దొంగలించారు’ అంటూ మాజీ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముందు ఆయన ఒక చెప్పు చూపించాడు.. ఈయన రెండు చెప్పులు చూపించాడు.. ఇదంతా ఒకటైతే తాజాగా ఇంకో చెప్పు వ్యవహారం తెరమీదకు వచ్చింది… ఇలాఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ‘చెప్పుల’ వార్ నడుస్తోంది.
తనను ప్యాకేజి స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతానని పవన్ కల్యాణ్ గతంలో పలు మార్లు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కూడా చెప్పు చూపించి మక్కెలిరగ్గొడతానంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. అందుకు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందిస్తూ, పవన్ కే కాదు మాక్కూడా చెప్పులు ఉన్నాయి అంటూ రెండు చెప్పులూ చూపించారు. దాంతో, పవన్ నిన్న పిఠాపురం సభలో, తన రెండు చెప్పులు ఎవరో కొట్టేశారంటూ సెటైర్ వేశారు. ఈ నేపథ్యంలో, పేర్ని నాని మరోసారి స్పందించారు. “చెప్పులు పోయాయని పవన్ కల్యాణ్ ఆందోళన చెందుతున్నట్టుంది. అయినా, చెప్పులు పోయిన సంగతి మూడ్రోజుల తర్వాత గుర్తొచ్చిందా…? సరే చెప్పులు పోతే ఎవరో ఒక నిర్మాత కొనిస్తారు… కానీ ఆయన పార్టీకి ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు పోయింది కదా… ముందు ఆ గాజు గ్లాసు గుర్తు ఎక్కడుందో వెతుక్కోమనండి” అంటూ ఎద్దేవా చేశారు.