చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీకి షాక్ తగిలింది. ఆ కంపెనీకి చెందిన అన్ని ఉత్పత్తుల తయారీ, అమ్మకాలతోపాటు దిగుమతిని కూడా నిలిపివేయాలని కోరుతూ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫిలిప్స్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తమ కంపెనీకి చెందిన పలు పేటెంట్లను షియోమీ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఫిలిప్స్.. కోర్టులో కేసు వేసింది.
షియోమీకి చెందిన ఉత్పత్తుల తయారీ, అసెంబ్లింగ్, దిగుమతితోపాటు అడ్వర్టయిజ్‌మెంట్లను కూడా నిలిపివేయాలని ఫిలిప్స్ తన పిటిషన్‌లో కోర్టును కోరింది. తమ కంపెనీకి చెందిన హెచ్ఎస్‌పీఏ, హెచ్ఎస్‌పీఏ ప్లస్, ఎల్టీఈ టెక్నాలజీలకు చెందిన పేటెంట్లను షియోమీ ఉల్లంఘించిందని ఫిలిప్స్ ఆరోపించింది.
అయితే ఫిలిప్స్ పిటిషన్ పై స్పందించిన కోర్టు ఆ కంపెనీని బ్యాంకుల్లో రూ.1000 కోట్ల నగదు నిల్వలను మెయింటెయిన్ చేయాలని ఆదేశించింది. ఇక ఈ కేసును జనవరి 18వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ఆ రోజు కోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఫిలిప్స్ కంపెనీ మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌కు కూడా పిటిషన్ ను పంపింది. భారత్‌లోని పలు పోర్టుల ద్వారా షియోమీ తీసుకువచ్చే ప్రొడక్ట్స్ దిగుమతులను ఆపేయాలని కోరింది. కాగా షియోమీ ఈ విధంగా ఆరోపణలు ఎదుర్కోవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఆ కంపెనీ మీడియా వివరణ కోరగా వారు స్పందించలేదు.