రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ధాన్యం సేకరణపై పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సేకరణపై సిఎమ్ ద్వారా బెదిరింపులు (ధమ్కీలు) చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో గోయల్ పరోక్ష ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పారా బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందని.. చేసికున్న ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం ముడిబియ్యం ఇస్తామన్నారని చెప్పారు.
ఇప్పుడు కొత్తగా వడ్లు (ధాన్యం) సేకరించాలని కోరుతున్నారని.. పంజాబ్ తరహాలో కొనాలని తెలంగాణ సిఎం లేఖ రాశారని గుర్తు చేశారు. పంజాబ్లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారని… కాబట్టి అలాంటి ముడిబియ్యాన్నే ఇవ్వాలని కోరామన్నారు.
అయితే, పదే పదే తెలంగాణ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని.. తెలంగాణలో పండే ముడి బియ్యం (రా రైస్) మొత్తం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రాల్లో మిగులు ధాన్యాన్ని ముడిబియ్యం మాత్రమే తీసుకుంటామని.. రైతుల ఖాతాల్లోకి నేరుగా ధాన్యం సేకరణ డబ్బులు పంపుతున్నామని చెప్పారు. ధాన్యం సేకరణ కోసం రాష్ట్రాలకు 90శాతం డబ్బు అడ్వాన్స్ గా పంపుతున్నామని.. ఏవైనా రాష్ట్రాలపై ఫిర్యాదులుంటే, బృందాలను పంపి రైడ్ చేస్తామని ప్రకటన చేశారు.