మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు : సీఎం కేసీఆర్

-

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుతున్నారు. అయితే ఈ సందర్భంలో నగరంలో శాంతి భద్రతల విషయంపై ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర నిరాశతో ఉన్న కొన్ని అరాచక శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్రలు పన్నుతున్నాయని, అలాంటి శక్తులపై ఉక్కుపాదంతో అణచివేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు.

CM KCR
CM KCR

ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం అధికారులతో కేసీఆర్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపొందెందుకు కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి మాటలను ప్రజలు పట్టింకోరని ధీమా వ్యక్తం చేశారు.

అరాచకవాదులు ఘర్షణలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వేరే జిల్లాల్లో గొడవలు సృష్టించి.. దాన్ని హైదరాబాద్ ప్రచారం చేయాలని చూస్తున్నారన్నారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద వికృత చేష్టలకు పాల్పడి మత కల్లోహాలు సృష్టించేందుకు పన్నాగం వేస్తున్నారని, ఈ ఘర్షణలతో జీహెచ్ఎంసీ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్లాన్ వేస్తున్నారని అన్నారు. దీనిపై పక్కా సమాచారం ఉందని తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ విద్రోహశక్తుల ఆటలు సాగనీవొద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని సూచించారు. పేకాట స్థావరాలు, గుడుంబా లాంటి సమస్య లేకుండా చూశామని, పభుత్వ ప్రత్యేక చర్యల వల్లే హైదరాబాద్ తో సహా రాష్ట్రమంతా సుభిక్షంగా ఉందన్నారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 1.60 కోట్ల జనాభా ఉందని, తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యతని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్రేకాలు రెచ్చగొట్టే వారి మాటలు విని యువత రెచ్చిపోవద్దని, ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలని రాజకీయ పార్టీలను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news