కరోనా వైరస్ నేపథ్యంలో షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకు లేదా కొన్ని వారాల వరకు భక్తులు ఆలయానికి రావద్దని విజ్ఞప్తి చేసింది. షిరిడీ ఆలయానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరింది. ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున ఒకే చోట ఉంటారు కనుక కరోనా వైరస్ త్వరగా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుందని, అందుకని భక్తులు ఆలయానికి రాకూడదని కోరింది.
షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ డోంగ్రె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశానుసారం భక్తులు కొన్ని వారాల పాటు ఆలయానికి రాకూడదని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కాగా షిరిడీ ఆలయంల మొత్తం మీద 11 ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్లను ఏర్పాటు చేశామని, దీంతో కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం సులభతరమవుతుందని తెలిపారు.
ఇక సాయిబాబా టెంపుల్ హాస్పిటళ్లలో ఐసొలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేశామని అరుణ్ తెలిపారు. దీంతోపాటు కరోనా వైరస్ పట్ల ఆలయ కమిటీ భక్తులకు అవగాహన కల్పిస్తుందని అన్నారు. ఇక మహారాష్ట్రలోనే ఇప్పటి వరకు 32 కరోనా కేసులు నమోదు కాగా ఆదివారం దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 107కు చేరుకుంది.