మళ్లీ అధికారం మాదే అని వైసీపీ అంటోంది. ఆ విధంగా ఊహల లోకంలో విహరిస్తోంది. అందుకు అనుగుణంగానే కొన్ని మంచి పనులు కూడా చేస్తోంది. ఇప్పటికిప్పుడు దిద్దుబాటు బాగున్నా దీర్ఘ కాలికంగా అవి పనిచేస్తాయని చెప్పలేం. ముఖ్యమంత్రి జగన్ పడుతున్న తపన మరియు తాపత్రయం ఇవాళ క్యాడర్ లేవు. అందుకే క్షేత్ర స్థాయిలో ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
ఎన్నడూ లేని విధంగా చాలా పథకాలు ఎవ్వరికీ అందకుండానే పోతున్నాయి. ముఖ్యంగా మంత్రుల పనితీరు చాలా చోట్ల అస్సలు బాలేదు. తప్పిద్దాం అనుకుంటున్నా కూడా అందుకు ముహూర్తం కుదరడం లేదు. పోనీ వారి స్థానంలో కొత్త వారిని తీసుకుని పనిచేయిద్దాం అనుకున్నా కూడా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ రీతిలో నాయకులు ఎవ్వరూ లేరు. ఈ దశలో శ్రీకాకుళం జిల్లాలో ఓ ఐదుగురిని టార్గెట్ చేస్తూ సీఎం వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరనే తెలుస్తోంది.
తొలిసారి అధికారంలో వచ్చిన ఎమ్మెల్యే సీదిరి అప్పల్రాజు మంత్రిగా రాణించలేకపోతున్నారు అని తెలుస్తోంది. వివిధ మీడియా కథనాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. అనుయాయులతోనే అసలు తలనొప్పి అని కూడా సమాచారం. దీంతో ఆయన పార్టీ విధేయుడిగా ఉన్నా కూడా సమర్థనీయ ధోరణిలో పనిచేయడం లేదని ప్రశాంత్ కిశోర్ రిపోర్ట్ ఒకటి నిర్థారించింది అని తెలుస్తోంది. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా ఆయన భార్య, చిన్న కుమారుడు వ్యవహార శైలి కారణంగానే ఎక్కువ వివాదాలు వస్తున్నాయని ప్రశాంత్ కిశోర్ రిపోర్ట్ తేల్చి చెప్పిందని తెలుస్తోంది. నరసన్నపేట కేంద్రంగా రాజకీయాలు నడిపే కృష్ణ దాసు ఇటీవల కాలంలో కొన్ని ఆకస్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ జగన్ సీఎం కాకపోతే తన ఆస్తులు రాసిస్తానని బహిరంగ సవాల్ విసిరి సంచలనం అయ్యారు. కానీ క్షేత్ర స్థాయిలో తనపై ఉన్న అవినీతి ఆరోపణలను మాత్రం అస్సలు ఆయన పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు టీడీపీ నుంచి వస్తున్నాయి.
ఇక ఎమ్మెల్యేల జాబితాలో మరో ఇద్దరి పేర్లు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఒకటి పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. మరొకటి
ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్..వీరిద్దరితో పాటు స్పీకర్ నియోజకవర్గం పై కూడా ఆరోపణలు ఉన్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం ఆమదాలవలసలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగకపోగా, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చిన విధంగా ఉందన్న ఆరోపణ ఒకటి ఉంది. దీంతో సీతారాం మంత్రి పదవి ఆశించినా జరిగే అవకాశమే లేదని తేలిపోయింది.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఐదు వైసీపీకి, మిగతా ఐదింటిలో నాలుగు టీడీపీకి, ఒకటి జనసేనకు దక్కే అవకాశాలున్నాయని కూడా తేలిపోయింది. జిల్లాల విభజన అయినా కూడా ఎచ్చెర్ల శ్రీకాకుళంలో ఉండనుంది. ఆ లెక్కన చూసుకుంటే కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా విజయనగరం జిల్లా పరిధిలోకి వచ్చే రాజాంలో కూడా వైసీపీ గెలుపు అవకాశాలు ఏమీ లేవనే తేలిపోయింది. ఇక్కడ ఎమ్మెల్యే కంబాల జోగులు విధి నిర్వహణ కూడా ఏమంత బాలేదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెబుతోంది.