నేడు కర్తవ్యపథ్‌ను ప్రారంభించనున్న మోదీ

-

ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ రోజున దేశ సైనికశక్తి ప్రదర్శనకు వేదికగా నిలిచే రాజ్‌పథ్‌ పేరు మారనుంది. ఇవాళ్టి నుంచి రాజ్‌పథ్ పేరు కర్తవ్యపథ్‌గా ప్రచారంలోకి రానుంది. ఈ పేరు మార్చాలన్న ప్రతిపాదనకు దిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి అధ్యక్షతన జరిగిన దిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇండియా గేట్‌ వద్ద ఉన్న నేతాజీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మార్గాన్ని ఇకపై కర్తవ్యపథ్‌గా పిలుస్తారు. వలసవాద విధానాలు, చిహ్నాలు మార్చాలన్న విధానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. బ్రిటిష్‌వారి కాలంలో కింగ్స్‌వే అని పిలవగా స్వాతంత్ర్యం తర్వాత రాజ్‌పథ్‌గా నామకరణం చేశారు. ఇప్పుడు కర్తవ్యపథ్‌గా మారనుంది.

కర్తవ్యపథ్‌ను ప్రధాని మోదీ ఇవాళ సాయంత్రం ప్రారంభించనున్నారు. నూతన పార్లమెంట్‌, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో కూడిన సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేశారు. 20 నెలలపాటు ఈ మార్గంలో ప్రజలను అనుమతించలేదు. శుక్రవారం నుంచి సందర్శనకు అనుమతించనున్నారు. సెంట్రల్‌ విస్టా అవెన్యూలో దారి పొడవునా ఆయా రాష్ట్రాలకు చెందిన ఆహార స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎర్రటి గ్రానైట్‌ వాక్‌ వేలు, చుట్టూ హరితవనాలు, విక్రయశాలలు, పార్కింగ్‌ ప్రదేశాలతోపాటు 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఈ ఉద్యాన వనాల్లోకి ఆహార పదార్థాలను అనుమతించరు.

దారిపొడవునా మొత్తం 16 వంతెనలు రెండుచోట్ల బోటింగ్‌ సదుపాయం కూడా ఉంటుంది. 1,125 వాహనాలు పార్కింగ్‌ చేసే సదుపాయం కల్పించారు. ఇండియాగేట్‌ వద్ద 35 బస్సులకు పార్కింగ్‌ వసతి ఉంటుంది. ఇండియా గేట్‌ చుట్టు పచ్చదనం ఉండేలా ప్రత్యేక ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు. 1930లో ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉండేదో ఆ స్థాయిలో పచ్చదనాన్ని పెంచారు. అక్కడి ప్రతిచెట్టు దాని ఎత్తు, రకం, పరిమాణాన్ని జియో ట్యాగింగ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news