నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్‌వరకు సెంట్రల్‌విస్టా అవెన్యూ ప్రారంభోత్సవానికి ముందు దిల్లీలోని ఇండియా గేట్ వద్ద 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. తర్వాత ప్రజలకు అభివాదం చేసి.. సెంట్రల్ విస్టా అవెన్యూని ప్రారంభించారు.
నేతాజీ సేవలను తరతరాలకు చాటేందుకు ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఖమ్మం జిల్లా గ్రానైట్ వినియోగించారు. ప్రఖ్యాత కళాకారుడు అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశారు. దేశంలోనే ఎత్తయిన ఏకశిలా విగ్రహాల సరసన నేతాజీ విగ్రహం చేరింది.
ఇంకోవైపు, దిల్లీలో కీలక ప్రాంతమైన రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మౌలిక సదుపాయాల పరంగా రాజ్‌పథ్‌లో అనేక మార్పులు చేశారు. ప్రజాసాధికారతకు చిహ్నంగా నిలిచే ఈ కర్తవ్యపథ్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉండే రాజ్‌పథ్‌ను వలసవాద విధానాలు, చిహ్నాల మార్పే లక్ష్యంగా కర్తవ్యపథ్‌గా నామకరణం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కర్తవ్యపథ్‌లో ఆహార స్టాళ్లు, వాక్‌వేలు, హరిత వనాలు, దారిపొడువునా 16 వంతెనలు, రెండుచోట్ల బోటింగ్, 1125 వాహనాలు పార్కింగ్ చేసేలా అవకాశం ఉండనుంది. అలాగే, విక్రయశాలలు, పార్కింగ్ ప్రదేశాల్లో 24గంటల పాటు భద్రత ఉండనుంది.