ప్రధాని మోదీ ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా దేశంలోని ఏడు రాష్ట్రాల సీఎంలకు ఫోన్ కాల్ చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరు కూడా వున్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకే ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి ఎలా ఉంది, కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
కరోనా వంటి క్లిష్ట సమయంలో కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కరోనా పరీక్షలను రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరింది. దీంతో పలు రాష్ట్రాలు మళ్లీ లాక్‌డౌన్ మంత్రాన్ని పాటిస్తున్నాయి.