మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ లోక్సభలో కీలక వ్యాఖ్యలు. చేశారు. ‘హైకోర్టు తీర్పు తర్వాత మణిపూర్లో పరిస్థితులు మారాయి. త్వరలో మణిపూర్లో శాంతి నెలకొంటుందని ప్రజలకు హామీ ఇస్తున్నా. నిందితులకు కఠిన శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నాయి. దేశం మీ వెంటే ఉందని అక్కడి ఆడబిడ్డలు, బిడ్డలకు చెప్పాలనుకుంటున్నా. మణిపూర్కు అండగా ఉంటాం’ అని మోదీ భరోసా ఇచ్చారు.
విపక్షాలు ప్రతిసారీ ప్రజల్ని నిరుత్సాహ పరుస్తూనే ఉన్నాయని విమర్శించారు ప్రధాని మోదీ. ఈ అవిశ్వాస తీర్మానాన్ని దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నామని తేల్చి చెప్పారు. 2018లోనూ విపక్షాలు ఇదే చేశాయని, ఇది తమకు ఫ్లోర్ టెస్ట్ కాదని, విపక్షాలకే అని వెల్లడించారు. విపక్ష కూటమిలోని కొందరు నేతలే ఈ అవిశ్వాస తీర్మానంపై అసహనం వ్యక్తం చేస్తున్నారన్న ఆయన క్రికెట్ ప్రస్తావన తీసుకొచ్చి ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. ఫీల్డింగ్‌ని విపక్షాలే సెట్ చేసినా…తమ పక్షం నుంచే ఫోర్‌లు, సిక్సర్లు వెళ్లాయని ఎద్దేవా చేశారు.