భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చారిత్రాత్మక ప్రాజెక్ట్ గగన్‌యాన్ మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మానవసహిత అంతరిక్ష నౌక మిషన్ కోసం మానవరహిత అంతరిక్ష ప్రయోగ పరీక్ష నౌకను (టీవీ-డీ1 టెస్ట్ ఫ్లయిట్) అక్టోబర్ 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సోమవారం ప్రకటించింది. టెస్ట్ మాడ్యూల్‌కు సంబంధించిన ఫోటోలను కూడా ఇస్రో పంచుకుంది. గగన్‌యాన్ మిషన్ సన్నాహాలను ఇప్పటికే విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో.. కీలక మిషన్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గగన్‌యాన్ మిషన్ సంసిద్ధతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించి పలు సూచనలు చేశారు.
చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్-1 విజయ పరంపరను కొనసాగిస్తూ ఇస్రో మరిన్ని ప్రతిష్ట్మాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు సూచించారు. గగన్ యాన్ మిషన్ సన్నద్ధతపై ఇవాళ ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. మరో పదేళ్లలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు, 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు అడుగుపెట్టే లక్ష్యంతో పని చేయాలని మోదీ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు.