భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రధాని మోదీకి అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని, మే నెలలో రోజుకు 4 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు ముందే హెచ్చరించారు. అయినప్పటికీ మోదీ పట్టించుకోలేదని, పైగా కుంభమేళా, ఎన్నికల ద్వారా వైరస్‌ను నలు దిశలా వ్యాప్తి చేశారని ఇప్పటికే చాలా మంది విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాకు చెందిన ది ఆస్ట్రేలియన్ అనే పత్రిక కూడా మోదీపై తీవ్ర విమర్శలు చేసింది.
ప్రధాని మోదీకి అహంకారం ఎక్కువని, ఆయన చేసిన పనుల వల్లే భారత్ నేడు ఈ దుస్థితిలో ఉందని, ఆయన ఇండియాలో లాక్‌డౌన్‌ను తీసేసి ఇండియాను వైరస్ విధ్వంసంలోకి తీసుకెళ్లారని, అందువల్లే కోవిడ్ విజృంభిస్తోందని ది ఆస్ట్రేలియన్ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ సంస్థ ట్వీట్ చేసింది.
అయితే ది ఆస్ట్రేలియన్ ప్రకటించిన అభిప్రాయంపై ఆస్ట్రేలియాలో ఉన్న భారత హై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత హై కమిషన్ ట్వీట్ చేసింది. ది ఆస్ట్రేలియన్ చేసిన వ్యాఖ్యలు అర్థ రహితమని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించింది. భారత హైకమిషన్ ఇందులో భాగంగానే ఓ లేఖను కూడా విడుదల చేసింది.
అయితే దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అనేక మంది నిపుణులు, విదేశీ సైంటిస్టులు కూడా భారత్ లో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని అంటున్నారు. కానీ దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది.