తెలంగాణలో కొన్నేళ్లుగా పోడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు ఎట్టకేలకు ఫుల్స్టాప్ పడబోతోంది. రాష్ట్రంలోని పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి ఆమె జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పోడుభూముల దరఖాస్తులు వచ్చిన గ్రామాల్లో గ్రామసభల ద్వారా సర్వేను పూర్తిచేశామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలిస్తామని వెల్లడించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, ఫ్రిబవరి మొదటి వారానికి పట్టా పాసుపుస్తకాల్ని ముద్రించి సిద్ధంగా పెట్టుకోవాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్ డోబ్రియాల్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టీనా పాల్గొన్నారు.