పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్వాసితులకు కేంద్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవుతున్న ఖర్చును రియంబర్స్మెంట్ ద్వారా చెల్లిస్తున్న కేంద్రం.. నిర్వాసితులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పరిహారం చెల్లించాలని ఏపీ కోరుతుంది. ఈ మేరకు నేడు పార్లమెంటులో వైసిపి కాకినాడ ఎంపీ వంగా గీతా కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ ను ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన ఆయన పోలవరం నిర్వాసితులకు ప్రత్యక్ష నగదు బదిలీ చేసే ఆలోచన లేదన్నారు. నిర్వాసిత కుటుంబాలకు పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా బదిలీ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పారు. లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీకి ఖర్చులను తిరిగి చెల్లించడంలో ఎలాంటి జాప్యం చేయడం లేదని చెప్పారు.