కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. ఒక్కసారిగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. కరోనా సోకిన రోగిన చూస్తే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. వారికి ఆమడు దూరంలో ఉంటున్నారు. ఆఖరికి కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనే ఓ గ్రామంలో జరిగిన ఘటనతో మానవత్వం ఇంకా బతికేఉందని రుజువైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సఖినేటిపల్లి లంక గ్రామంలో కరోనా పాజిటివ్ పేషేంట్ ను క్వారెంటైన్ కు తరలించాల్సి ఉంది.
అసలే వరదల సమయం.. పైగా కరోనా పేషేంట్.. దీంతో అతన్ని తీసుకు రావడానికి ఉదయం నుండి ఎవ్వరు ముందుకు రాకపోవడంతో సఖినేటిపల్లి ఎస్సై గోపాల కృష్ణ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ నాయుడు బాలాజీ అనే వ్యక్తిని తీసుకుని రాత్రి సమయంలో వరదలో పర్యటించి కోవిడ్ పేషేంట్ ఇంటికి వెళ్లి ట్రాక్టర్ పై అతన్ని అంబులెన్స్ వద్దకు చేర్చారు. కరోనా పేషేంట్ కావడంతో ఎవ్వరు ముందుకు రాకపోవడంతో ఎస్సై గోపాల కృష్ణ చొరవ చూపారు.. ఈ సందర్భంగా ఎస్సై గోపాల కృష్ణ అమలాపురం డీఎస్పీ షేక్ మాసుం భాష , పలువురు అభినందించారు.