ఏకంగా సీఐ ఇన్నోవానే కొట్టేశాడు.. కానీ !

వాళ్ళ బళ్ళు, వీళ్ళ బళ్ళు కొట్టేస్తే కిక్కేముంది ? అనుకున్నారో ఏమో కానీ ఏకంగా పోలీస్ ఇన్స్పెక్టర్ వాహనన్నే చోరీ చేశారు చోర శిఖామణులు. కానీ అది బెడిసి కొట్టి వేరే వాహనాన్ని గుద్దడంతో దాన్నీ అక్కడే వదిలి వెళ్ళాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఈదులగూడా వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు వాడుతోన్న పోలీసు ఇన్నోవా వాహనం చోరీకి గురయింది.

నిన్న అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సిఐ విచారిస్తుండగా..పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనంతో కోదాడ వైపు ఒక యువకుడు పరారయ్యాడు. ఇక సమాచారం అందుకోవడంతో చేజింగ్ చేసి ఆలగడప టోల్గేటు వద్ద వాహనాన్ని రూరల్ ఎస్ఐ పరమేష్ మరో వాహనాన్ని అడ్డంగా పెట్టి పట్టుకున్నారు. అయితే అంతకు ముందే పోలీసు వాహనం అని టెన్షన్ పడ్డాడో లేక ఆయన కూడా మత్తులో ఉన్నాడో తెలియదు కానీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొనడంతో కారు ముందు భాగం ధ్వంసం అయింది. దీంతో పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.