వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హస్తం పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాషాయ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ ప్రతాప్ బాజ్వా సోదరుడు ఎమ్మెల్యే ఫతే సింగ్ బాజ్వా ఉండటం గమనార్హం. ఆయన ప్రస్తుతం ఖాదియాన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హరగోవింద్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ సైతం బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్టీలోకి ఆహ్వానించారు.
గత వారం కాంగ్రెస్‌కు చెందిన మరో ఎమ్మెల్యే రాణా గుర్మిత్ సోధి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మాజీ సీఎం అమరీందర్‌సింగ్ అనుచరులు. గత నెలలో అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమరీందర్ సింగ్‌కు చెందిన పంజాబ్ లోక్ కాంగ్రెస్‌లో చేరకుండా బీజేపీలో చేరడం గమనార్హం.