వైసీపీలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్టుగానే అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలోనూ వర్గ పోరు తారస్థాయికి చేరింది. నువ్వా-నేనా అనే రేంజ్‌లో నాయకులు రోడ్డెక్కుతున్నారు. అయితే, ఇతర నియోజకవర్గాల్లో ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు వర్సెస్ ఎమ్మెల్యేలుగా పోరాటం సాగుతుంటే.. ఇక్కడ మాత్రం తమ ఆధిపత్యం కోసం.. ఇద్దరు మాజీ నేతలు పోరాటం చేసుకుంటున్నారు. గత ఏడాది ఎన్నికల్లో ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో గెలుపు గుర్రం ఎక్కారు.
అయితే, తాను ఎమ్మెల్యే కాకపోయినా.. తానే అన్ని అయి చూసుకుంటున్నారు విశ్వేశ్వరరెడ్డి. ఇక్కడ విజయం సాధించిన టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్‌ను కూడా ఆయన డామినేట్ చేస్తున్నా రు. అయితే, ఇదే నియోజకవర్గంపై కన్నేసిన మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కూడా ఓ గ్రూపును ఏర్పాటు చేసుకుని.. అన్ని కార్యక్రమాలు తన కనుసన్నల్లోనే జరగాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో రెండు కూటములు ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ సొంతం చేసుకునేందుకు శివరామిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో తన టికెట్‌కే ఎసరు పెట్టేలా.. వ్యవహరిస్తున్న శివరామిరెడ్డిపై విశ్వేశ్వరరెడ్డి అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో వలంటీర్లను తన వారినే ఎంపిక చేసుకున్నారని గతంలో శివరామి రెడ్డి నేరుగా విమర్శలు చేశారు. దీంతో అప్పట్లో జోక్యం చేసుకున్న అధిష్టానం.. మొత్తం అందరినీ రద్దు చేసి కొత్తగా నియామకాలు చేపట్టింది. ఈ క్రమంలో తాను విజయం సాధించానని భావించిన శివరామిరెడ్డి మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు.
మరోవైపు.. తనకు అడ్డుతగులుతున్న రామిరెడ్డిపై పైచేయి సాధించేందుకు విశ్వేశ్వరరెడ్డి కూడా అంతే దూకుడు ప్రదర్శిస్తున్నారు. స్థానిక గాలిమరల కంపెనీలో ఉద్యోగాల విషయమై వారిద్దరి మధ్యా విభేదాలు తెరపైకి వచ్చాయి. ఉరవకొండ సమీపంలో ఉన్న గాలిమరల కంపెనీలో శివరామ్ రెడ్డికి చెందిన 9 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఈ వ్యవహారం వెనుక విశ్వేశ్వరరెడ్డి, ఆయన తనయుడు ప్రణయ్ రెడ్డిల ప్రోద్భలం ఉందని శివరామి రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా శివాలెత్తారట.
ఏకంగా కంపెనీ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులను నిలదీశారు. తమ వర్గానికి చెందిన వారిని కాదని విశ్వేశ్వరరెడ్డి వర్గీయులకు ఏ విధంగా ఉద్యోగాలిస్తారంటూ బెదిరింపులకు దిగినట్టు కంపెనీ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు ఇరు వర్గాల మద్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందని అంటున్నారు పరిశీలకులు.