పోల‌వ‌రంలో అడుగ‌డుగునా అక్ర‌మాలే : కాగ్ నివేదిక‌

-

  • క‌డిగి పారేసిన కాగ్ నివేదిక‌
  • పిపిఏతో ఒప్పందంలో మ‌త‌ల‌బేంటి?
  • రాయ‌పాటి సంస్థ‌కు జ‌రిమానాకు బ‌దులు 1331.91 కోట్ల న‌జ‌రానా ఎందుకు?
  • కుడి, ఎడమ కాలువ అంచనా వ్యయం రూ.8,021 కోట్లు పెంచింది కాంట్రాక్ట‌ర్ల‌కోస‌మే
  • రూ.1,407.64 కోట్ల బిల్లుల వివరాలు పీపీఏకు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టిన కాగ్‌..

పోల‌వ‌రం నిర్మాణంతో త‌న జీవితం ధ‌న్య‌మైపోయింద‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు ప్ర‌భుత్వం ఆ మాటున చేస్తున్న అవినీతి, అక్ర‌మాలను కంప్ర్టోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) నివేదిక క‌డిగి పారేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జ‌రుగుతున్న లోటుపాట్ల‌ను ఎండ‌గ‌ట్టింది. హెడ్‌వర్క్స్‌ కాంట్రాక్టర్‌కు భారీ ప్రయోజనం కల్పించారని, పనుల్లో మాత్రం పురోగతి లేదని పేర్కొంది. బుధవారం శాసనసభలో ప్ర‌వేశ‌పెట్టిన కాగ్ నివేదిక‌లో అనేక అక్ర‌మాలు వెలుగుచూశాయి.

సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ (సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటిరీయల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌)తో ఒప్పందం చేసుకునే వరకూ అంటే 2017 జూలై వరకూ ప్రాజెక్టు పనుల నాణ్యత పరిశీలనకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయకపోవడంపై కాగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలులో అవతవకలను కడిగేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని 2014 మే నెలలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం దీనితో ఒప్పందం చేసుకోవాలని పదేపదే కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కాగ్‌ పేర్కొంది.

పోలవరం హెడ్‌వర్క్స్‌ పనులను దక్కించుకున్న టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌(జేవీ) సంస్థకు వాటిని పూర్తి చేసే సామర్థ్యం లేదని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీలు తేల్చి చెప్పాయి. 2016 సెప్టెంబరు వరకూ హెడ్‌వర్క్స్‌లో ఎలాంటి పురోగతి లేదు. కాంట్రాక్టర్‌పై జరిమానా విధించి వసూలు చేయాల్సిన సర్కార్‌ అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. ఒప్పందం గడువు ముగియడానికి రెండేళ్ల ముందే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులోనూ లేని తరహాలో 2016 సెప్టెంబరు 8న అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచేసి కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చిందని కాగ్‌ తప్పుబట్టింది. ఈ నివేదికలో కాగ్‌ ప్రస్తావించిన ఇతర అంశాలు ఇవీ..

అంచ‌నా వ్య‌యం పెంచేసి పంచేసుకున్నారు

‘అంచనా వ్యయాన్ని పెంచిన నేపథ్యంలో రూ.66.59 కోట్లను ఫెర్పార్మెన్స్‌ సెక్యూరిటీ కింద కాంట్రాక్టర్‌ నుంచి వసూలు చేయాల్సిన సర్కార్‌ మినహాయింపు ఇచ్చింది. నిబంధనల ఉల్లంఘించి రూ.25.37 కోట్ల విలువైన స్టీలును కొనుగోలు చేసి హెడ్‌వర్క్స్‌ కాంట్రాక్టర్‌కు సరఫరా చేసింది. యంత్రాల దిగుమతిపై సుంకాన్ని కాంట్రాక్టర్‌కు బదులుగా ప్రభుత్వమే రూ.5.72 కోట్లు చెల్లించింది. మట్టి నిల్వకు డంపింగ్‌ యార్డ్‌ భూమిని కాంట్రాక్టరే సేకరించాల్సి ఉండగా సర్కారే రూ.32.66 కోట్లను ఖర్చు చేసి 203.74 ఎకరాలను సేకరించింది. ఈ డ‌బ్బంతా కాంట్రాక్ట‌ర్లు, ప్ర‌భుత్వ పెద్ద‌ల మ‌ధ్య పంప‌కానికి సంబంధించిందేన‌ని తెలుస్తోంది.

అడ్వాన్సులపై అడ్వాన్సులు..

కాంట్రాక్టర్‌కు మొదట రూ.404.86 కోట్లను మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ప్రభుత్వం ఇచ్చింది. 21వ బిల్లు నుంచి 11 శాతం వడ్డీతో మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ వసూలు చేయాలి. అయితే దీన్ని వాయిదా వేస్తూ వచ్చింది. రూ.422.20 కోట్ల విలువైన డయాఫ్రమ్‌ వాల్‌ పనులను సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించిన సమయంలో నిబంధనలను ఉల్లంఘించి రూ.95 కోట్లను మళ్లీ మొబిలైజేషన్‌ అడ్వాన్సుగా ఇచ్చింది. 2017 జూన్‌ నాటికి 76 శాతం పని పూర్తి కావాల్సి ఉండగా కేవలం 31 శాతం పనులు మాత్రమే పురోగతిలో ఉంది.

కాలువ ప‌నుల్లో భారీ అక్ర‌మాలు

పోలవరం కుడి, ఎడమ కాలువల పనుల్లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. పీపీఏ అనుమతి తీసుకోకుండానే అంచనా వ్యయాన్ని రూ.8,021 కోట్లకు పెంచేస్తూ 2016 డిసెంబర్‌ 6న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గడువులోగా పనులు చేయని కాంట్రాక్టర్లపై జరిమానా విధించాల్సింది పోయి అంచనా వ్యయాన్ని పెంచేసి అనుచిత లబ్ధి చేకూర్చారు. కాలువల పనుల్లో పైపు లైన్లు, విద్యుత్‌ స్తంభాల తరలింపు వ్యయాన్ని కాంట్రాక్టర్లకు బదులుగా సర్కారే భరించడం ద్వారా రూ.38.12 కోట్ల లబ్ధి కలిగించారు. 3.28 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టాల్సిన సర్కార్‌ మీనవేషాలు లెక్కిస్తోంది.

భూసేకరణ, పునరావాస ప్యాకేజీలో అక్రమాలు

కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ సహకారంతో డీపీఆర్‌ రూపొందించాల్సి ఉండగా పోలవరంలో జీఎస్‌ఐ చిత్రాల ఆధారంగా రూపొందించారు. తొలుత 54,448.69 ఎకరాలు ముంపునకు గురవుతాయని, 44,574 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నట్లు లెక్కగట్టారు. తాజాగా ముంపు భూమి 1,03,585.21 ఎకరాలకు, నిర్వాసితు కుటుంబాల సంఖ్య 1,05,601కి పెరగడం విస్మయం కలిగిస్తోంది. సహాయ, పునరావాస ప్యాకేజీ అమలుకు అంబుడ్స్‌మెన్‌ను నియమించకపోవడంతో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ కింద వెచ్చించిన రూ.1,407.64 కోట్లకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పీపీఏకి సమర్పించలేదు.’?

– విభజన చట్టం హామీ మేరకు పోలవరాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)తో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒప్పందం చేసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి?

– పోలవరం హెడ్‌వర్క్స్‌ కోసం ఒప్పందం కుదుర్చుకున్న ట్రాన్స్‌ట్రాయ్‌–జేఎస్సీ–ఈసీ–యూఈఎస్‌(జేవీ) మూడేళ్ల దాకా పనులే ప్రారంభించలేదు. కాంట్రాక్టర్‌కు జరిమానా విధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం గడువు ముగియక ముందే అంచనా వ్యయాన్ని రూ.1,331.91 కోట్లు పెంచేసింది. ఇది అనుచిత లబ్ధి కాదా?

– భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ పనుల్లో రూ.1,407.64 కోట్ల వ్యయానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇప్పటివరకూ అందచేయలేదు.  వీట‌న్నింటికీ చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు స‌మాధానం చెప్పాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news