విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. విపక్షాలతో చర్చించకుండానే భూసేకరణ-2018 చట్టం తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ చట్టం రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమని అన్నారు. స్వార్దంతోనే చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. రైతుల పొట్టగొట్టే జీవో 562ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు ముమ్మాటికీ రైతు వ్యతిరేకి అనే విషయం ఈ చట్టంతో స్పష్టమైందని అన్నారు. ‘తండ్రీ, కొడుకుల మాదిరి పార్క్ హయత్ హోటల్‌లో జల్సా చేసే వారికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయి’ అని బాబు, లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రజల కష్టార్జితాన్ని ఇష్టారీతిన ఖర్చు పెడుతూ.. హోటల్ బిల్లులు చెల్లిస్తున్నారని దుయ్యబట్టారు. మరో నాలుగునెలల్లో బాబు గద్దె దిగక తప్పదని జోస్యం చెప్పారు. నాడు వ్యవసాయం లాభసాటి కాదని చెప్పిన చంద్రబాబు.. నేడు ఆ దిశగా రైతుల్ని బెదిరించీ, భయపెట్టి వ్యవసాయ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్రలు చేస్తున్నాడని రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.