వాళ్ళ చేరికలపై టీడీపీలో అసంతృప్తి.. అవకాశవాదులు అవసరమా అంటూ చర్చలు

-

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. బలంలేని నియోజకవర్గాల్లో…అలాగే కొన్ని కార్పొరేషన్లలో జంపింగ్ లను ప్రోత్సహిస్తోంది.. ప్రకాశం,ఏలూరు, కడప, నెల్లూరు, విశాఖపట్నం వంటి జిల్లాల్లో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టింది.. ఈ క్రమంలో పలువురు కార్పొరేటర్లు, ముఖ్యనేతలు పార్టీలో చేరిపోయారు.. పసుపు కండువా కప్పుకున్నారు.. వారి చేరికలపై ఇప్పుడు టీడీపీలో గట్టి చర్చలే నడుస్తున్నాయి..

వైసీపీలో ఐదేళ్లు అధికారాన్ని అనుభవించిన నేతలందరూ ఇప్పుడు టీడీపీ పంచన చేరుతున్నారు.. చేరుతున్నారు అనడం కంటే.. నయానో, భయానో చేరిపించుకుంటున్నారు అంటే బాగుంటుందేమో.. ఎందుకంటే క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.. వైసీపీకోసం పనిచేసిన వారిని టీడీపీలోకి ఎలా తీసుకుంటారని స్వంత పార్టీ క్యాడరే నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. వారి వల్ల నష్టం తప్ప.. లాభం ఉండదని వారు అంటున్నారు..

ఇప్పుడు పార్టీలో చేరిన వారందరూ.. గతంలో తమను ఇబ్బంది పెట్టిన వారే అని.. వారి చేతిలో దెబ్బలు తిని.. కేసులు పెట్టించుకున్న వారే ఇప్పుడు తమపై పెత్తనం చేసేందుకు వస్తున్నారంటూ టీడీపీ పాతతరం నేతలు మండిపడుతున్నారట.. ఈ విషయంపై జిల్లా నేతలు, ప్రజాప్రతినిదులకు చెప్పినా.. వారు వినడం లేదని, పార్టీ కోసం పనిచేసిన నేతలు వాపోతున్నారు.. ఏలూరు, ప్రకాశం, విశాఖపట్నం వంటి నగరాల్లో ఉండే ముఖ్య నేతలు గతంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు.. అలాంటి వారిని పార్టీలోకి తీసుకోవడం వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఉండదనే వాదనను టీడీపీ నేతలు వినిపిస్తున్నారు..

పదవుల కోసం, అధికారం కోసం వారందరూ పార్టీలోకి వస్తున్నారు.. వారు చేరడం వల్ల తమకు ఉండే అవకాశాలు పోతాయనే ఆందోళనలో టీడీపీ నేతలు ఉన్నారట.. దీనిపై రాష్ట నాయకత్వం పునరాలోచించాలని క్యాడర్ కోరుతోంది.. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news