ఈ నెల 2వ తేదీన కొంగరకలాన్ లో తాము నిర్వహించిన ప్రగతి నివేదన సభ సూపర్ సక్సెస్ అయిందని ఓ వైపు టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ సభ ఫ్లాప్ అయిందని, కేసీఆర్ తన బలం నిరూపించుకోవడం కోసమే ఈ సభను నిర్వహించారని ఆరోపిస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రతిపక్షాల మాటలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పైగా రానున్న 50 రోజుల్లో మొత్తం 100 బహిరంగ సభలను నిర్వహించనున్నామని తెలిపారు.
హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బహిరంగ సభకు ప్రజల ఆశీర్వాద సభ అని పేరు పెట్టామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ హుస్నాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్‌లు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హుస్నాబాద్‌లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను, సభాస్థలాన్ని పరిశీలించారు.
అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. 50 రోజుల్లో 100 బహిరంగ సభలను పెడతామని తెలిపారు. తాము ఈ నాలుగేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు బహిరంగ సభల ద్వారా తెలియజేస్తామని అన్నారు. పండితుల సూచించిన కారణంగా శ్రావణ మాసంలో బహిరంగ సభలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతమైన హుస్నాబాద్‌ను తొలి సభకు ఎంపిక చేశామని మంత్రులు చెప్పారు. హుస్నాబాద్ ఆర్‌టీసీ డిపో పక్కన ఉన్న మైదానంలోనే సభను నిర్వహిస్తారని సమాచారం..!