బీజేపీ అభ్య‌ర్థి, మాజీ క్రికెట‌ర్ గంభీర్ న‌న్ను వేశ్య అన్నాడు.. ఆప్ ఎంపీ అభ్య‌ర్థి అతిషి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..!

ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పు ఢిల్లీ లోక్‌స‌భ అభ్య‌ర్థి అతిషి.. బీజేపీ అభ్య‌ర్థి గౌతం గంభీర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

లోక్‌స‌భ ఎన్నిక‌లు ఏమోగానీ దేశంలోని ప‌లు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఇంకా ప‌లు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు పూర్తి కావ‌ల్సి ఉన్న నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో పోటీలో ఉన్న అభ్య‌ర్థులు ప్ర‌త్య‌ర్థుల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డుతున్నారు. నోటికి ఎంత మాట వ‌స్తే అంత మాట అనేస్తున్నారు. ఓవైపు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అలాంటి నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. నేత‌లు త‌మ నోళ్ల‌కు ప‌నిచెప్ప‌డం ఆప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌ఫున తూర్పు ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఎంపీ అభ్య‌ర్థి అతిషి త‌న‌పై బీజేపీ అభ్య‌ర్థి, మాజీ క్రికెట‌ర్‌ గంభీర్ అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని, త‌న ప‌ట్ల అమర్యాద‌పూర్వ‌కంగా, అస‌భ్య‌క‌రంగా ఉన్న మాట‌లను పాంప్లెట్లలో ప్ర‌చారం చేస్తున్నాడ‌ని చెబుతూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పు ఢిల్లీ లోక్‌స‌భ అభ్య‌ర్థి అతిషి.. బీజేపీ అభ్య‌ర్థి గౌతం గంభీర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. గంభీర్ త‌న‌ను వేశ్య అని చెబుతూ.. త‌న ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ఉన్న మాట‌ల‌ను ఓ పాంప్లెట్‌లో రాసి గంభీర్ ఆ పాంప్లెట్ల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని, అలాగే అందులో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌ను కుక్క అని, డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను కంజ‌ర్ అని రాశార‌ని చెబుతూ.. ఆ పాంప్లెట్‌లో ఉన్న వాక్యాల‌ను అతిషి విలేక‌రుల స‌మావేశంలో చ‌దివి వినిపించారు.


అయితే మ‌రోవైపు గంభీర్ మాత్రం ఇదంతా అవాస్త‌వ‌మ‌ని ఖండించాడు. ఎవ‌రో త‌న పేరు ఉప‌యోగించి ఇలా చేస్తున్నార‌ని, తాను ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు నిరూపిస్తే తాను ఎన్నిక‌ల పోటీ నుంచి త‌ప్పుకుంటాన‌ని గంభీర్ ట్వీట్ చేశాడు. ఈ క్ర‌మంలో ఇప్పుడీ విష‌యం దుమార‌మే రేపుతోంది. కాగా గ‌తంలోనూ అతిషి గంభీర్ రెండు ఓట‌ర్ ఐడీ కార్డులను క‌లిగి ఉన్నాడంటూ వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది. మ‌రి ఇప్పుడు ఈ విష‌యం ఏ మ‌లుపు తిరుతుందో వేచి చూడాలి..!