ఆప్ లో ప్రొఫెసర్ కోదండరాం పార్టీ విలీనం….?

పంజాబ్ విజయంతో జోరు మీదుంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను గడువులోగా నిర్వహించాలని… ఈ ఎన్నికల్లో మీరు గెలిస్తే రాజకీయాలను వదిలిపెడుతా అంటూ.. కేజ్రీవాల్ బీజేపీకి సవాల్ విసురుతున్నారు. ఇన్నాళ్లు ఢిల్లీకే పరిమితం అయిన ఓ ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆప్ ప్రస్తుతం పంజాబ్ అధికారాన్ని ఏర్పాటు చేసింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ లో ఏకంగా 92 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. మరోవైపు గోవాలో 2 స్థానాల్లో గెలుపొందింది.

kodandaram tjs - Telangana Janasamithi

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఆప్ దక్షిణాదిని టార్గెట్ చేసింది. ముఖ్యంగా తెలంగాణపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఆప్ తో కలిసి వచ్చే పార్టీతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) ను ఆప్ లో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఈ ప్రతిపానపై కోదండరామ్ పార్టీ కీలక నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ రానున్నారు. ఆయన సమక్షంలో పార్టీ విలీన ప్రకటన చేస్తే బాగుంటుందని.. మెజారిటీ నాయకులు తమ అభిప్రాయంగా వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ కన్వీనర్ గా ఉండీ.. తెలంగాణ ఏర్పాటులో కీలకమైన ఆందోళన కార్యక్రమాలకు నాయకత్వం వహించారు కోదండరామ్. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత టీజేఎస్ స్థాపించి పలు ఎన్నికల్లో పోటీచేసినా… కోదండరామ్ ను విజయం వరించలేదు. ఇక ఆప్ లో తన పార్టీని విలీనం చేసి తెలంగాణలో కొత్త రాజకీయాలకు తెరలేపబోతున్నట్లు తెలుస్తోంది.