- జీవో 77ను రద్దు చేయండి.. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించాలి
- టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
అమరావతిః విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రియంబెర్స్ మెంట్ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యావకాశాల్లో నిరాకరిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దనీ, వారి ఉజ్వల భవిష్యత్తుకు అడ్డుపడవద్దని పేర్కొన్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఏం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు సీఎం జగన్. విద్యార్థి లోకం తిరగబడితే నువ్వు తాడేపల్లి కోట నుండి బయటకు అడుగుపెట్టలేవు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసారు. ఇప్పుడు ఏకంగా ప్రయివేటు కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ జీవో 77 తీసుకొచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తున్న జీవో77 ని రద్దు చెయ్యమని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపితే ApTnsf నాయకుల పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చెయ్యడం దుర్మార్గపు చర్య. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకొనీ ,జీవో77 ని రద్దు చెయ్యాలి.ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని పునరుద్ధరించాలి అని పేర్కొన్నారు.
అధికార వైఎస్సార్ సీపీ సర్కారు బడుగు, బలహీన వర్గాల వారిని, వెనుకబడిన తరగతుల న ఉన్నత చదువులు చదివించే అవకాశాలను హరించివేస్తోది అని ఆరోపించారు. ఏపీ టీఎన్ ఎస్ ఎఫ్ నాయకుల అరెస్టులను నిరసించిన లోకేశ్.. విద్యార్థుల నిరసనలను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అరెస్టులు, బలమైన అస్త్రాల ఎత్తుగడలను ఆశ్రయిస్తోందని విమర్శించారు.
విద్యార్థి వ్యతిరేక విధానాలు, నిర్ణయాలు ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జగన్ పాలన పట్ల యువత అసంబద్దవైఖరితో అసంతృప్తిగా ఉందనీ, తాము వైఎస్సార్ సీపీకి గట్టి గుణపాఠం నేర్పుతామని చెప్పారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మహిళలకు భద్రత లేదని లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నేతలు కేవలం దిశా చట్టం పేరుతో మాత్రమే నాటకాలు ఆడుతున్నారనీ, కానీ గత ఏడాదిన్నర కాలంలో ఒక్క మహిళా బాధితురాలికి న్యాయం చేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక మూల అమాయక మహిళలపై ప్రతిరోజూ అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు.