అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగడం, కామన్. కానీ రాజంపేటలో మాత్రం తెలుగు తమ్ముళ్లు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఇక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా యుద్ధం జరుగుతోంది.ఏకంగా మంత్రి టార్గెట్‌గా టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఎర్రచందనం, మట్టి మాఫియాకు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ అధికారిక కార్యక్రమాల్లో ఆరోపణలు గుప్పిస్తున్నారు పార్టీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అధికారులను పేషీలో పెట్టుకొని, తన బంధు వర్గానికి లాభం జరిగేలా ప్లాన్స్ వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నారు టీడీపీ నేతలు. ఇదే క్రమంలో పార్టీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం,అన్నమయ్య జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు మధ్య తలెత్తిన వివాదం పెద్దలకు తలనొప్పిగా మారుతోంది.
రాజంపేట ఇంచార్జ్ బాధ్యతలను ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి అప్పగించింది అధిష్టానం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు ఆయనకు అప్పగించింది.అయితే రాంగోపాల్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. కార్యక్రమాలకు అధికారులు రాకుండా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్సీపై విరుచుకుపడుతున్నారు.ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడానికి అధికారులు లేకుంటే ఎలాగన్నది ఆయన క్వశ్చన్. ఇదే వేదికపై నుంచి ఇటు ఎమ్మెల్సీ, అటు అన్నమయ్య జిల్లాకు చెందిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పైన ఆరోపణలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మంత్రి ఎర్రచందనం, మట్టి మాఫియాలను ప్రోత్సహించడమేకాకుండా, తెలుగుదేశం కార్యకర్తలకు కనీస సాయం కూడా చేయడం లేదన్నది సుగవాసి చెప్తున్న మాట. మంత్రి వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని సుగవాసి అనడం ఇంకా కాక రేపుతోంది.
ఈ పరిణామాలతో రాజంపేట టీడీపీలో రాజకీయం రంజుగా మారింది.అటు సుగవాసి ఆరోపణలపై రాజంపేట టిడిపి సీనియర్ నేత వెంకట నరసయ్య ఘాటుగా స్పందించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కు సుగవాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో మరోమారు చెలరేగిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం…. ఎన్నికల్లో తన ఓటమికి మేడా బ్రదర్స్ కారణమని ఆరోపించారు.ఇదంతా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం వేదికలపై జరగడంతో అటు జనాలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు.పార్టీ సీనియర్ లీడర్ సుగవాసి రోజుకో నాయకుడి మీద ఆరోపణలు చేయడంతో అసలాయన అంతరంగం ఏంటన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఆయన ఏదైనా పదవి ఆశిస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.రాను రాను ఈ గొడవలు పెద్దవి అయితే పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉంది.రాజంపేట విభేదాలకు ఆదిలోనే చెక్ పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నారు.