ప్రజా ఉద్యమాలతో ఎప్పుడూ చురుగ్గా ఉండే వామపక్షాలు ఏపీలో సైలెంట్ అయ్యాయి. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో కార్మికులకు, అణగారిన వార్గాల వారికి అండగా నిలబడే వామపక్షాలు ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించగలిగేది వామపక్షాలే. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసినా కనీస డిపాజిట్లు దక్కించుకోలేక పోయారు. దీంతో ఇప్పుడు అధికార పార్టీతో జట్టు కట్టాలని తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు ఉభయ కమ్యూనిస్టులు. ఏపీలో పూర్వవైభం రావాలన్నా ప్రజలకు చేరువ కావాలన్నా కూటమికి దగ్గర కావడమే మార్గమని కమ్యూనిస్టు నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు చంద్రబాబుతో తెరవెనుక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి.మూడు పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో గెలిచాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒంటరిగా ప్రయాణం చేసేందుకే ఇష్టపడతారు. ఆయన సొంత రాజకీయ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎవరి సపోర్ట్ తీసుకోకుండానే పార్టీని నిలబెట్టుకున్నారు. 2014లో జగన్ ఏపీకి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కానీ ఎన్నడూ విపక్షాలను కలుపు కెళ్లే ప్రయత్నం చేయలేదు. ఐక్య పోరాటాల కంటే ఒంటరి పోరుకు జగన్ ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వచ్చారు.
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా విపక్షాలతో కలవాలన్న ఆలోచన చేయలేదు. దీంతో ఆయనతో కలిసి వెళ్ళేందుకు వామపక్షాలు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.చంద్రబాబు సీఎం అయ్యారు.ఒకప్పుడు ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉండటంతో విధానపరమైన అంశాల విషయంలో విమర్శలు చేస్తూనే.. మంచి పనులను ఆహ్వానిస్తున్నారు వామపక్షాల నేతలు. పింఛన్ల పెంపు వంటి విషయంలో చంద్రబాబును స్వయంగా కలిసి అభినందించారు.కానీ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెబుతూ ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నాకు మాత్రం మద్దతు ఇవ్వలేదు.కనీసం సానుకూల ప్రకటన కూడా చేయలేదు.
సాధారణంగా వామపక్షాలు ఎప్పుడు ప్రతిపక్షమే. కానీ ఏపీలో మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి వామపక్షాలు.ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన జగన్ ప్రజా పోరాటాలు చేయక తప్పని పరిస్థితి.అయినప్పటికీ వామపక్షాలను కలుపుకెళ్ళే ప్రయత్నం చేయడం లేదు జగన్.2029 ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీతో జగన్ కలిసి వెళ్ళక తప్పదు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిందే వైసిపి. వైసీపీ ఆవిర్భావం తర్వాత వామపక్షాలకు విలువ ఇచ్చింది లేదు.
ఇన్ని రోజులు తమను పట్టించుకోని జగన్.. ఇప్పుడు దగ్గరకు పిలిచినా వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.అందుకే వామపక్షాలు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి పాలనపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు.దీంతో చంద్రబాబు కూడా వామపక్షాలు ఇచ్చే సలహాలను తీసుకుంటామని అప్పుడే క్లారిటీ ఇచ్చారు.అంటే వారితో కలిసి పనిచేస్తామనేది చంద్రబాబు భావన.కేంద్రంలో ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలు ఏపీలో మాత్రం ఎన్‌డిఏ కూటమిలోని టీడీపీతో జతకడుతున్నాయి. వామపక్షాల తీరు గతం కంటే చాలా భిన్నంగా ఉందండోయ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.