ఏపీలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి జగన్ ముఖ్యమంత్రిగా పాల్గొంటుండగా, అటు చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో పాల్గొననున్నారు.
ఏపీలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు అయి రోజులు గడుస్తున్నా.. ఇంకా అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేయలేదు. అయితే ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు ఆ సమావేశాలు జరగనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఈ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతోపాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను కూడా ఎన్నుకోనున్నారు. ఇక అసెంబ్లీలో వైసీపీకే బలం ఎక్కువగా ఉంది కనుక ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలనే స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లుగా ఎన్నుకోనున్నారు.
ఏపీలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి జగన్ ముఖ్యమంత్రిగా పాల్గొంటుండగా, అటు చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో పాల్గొననున్నారు. ఇక ఈ సమావేశాల్లోనే ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను కూడా ప్రకటిస్తారు. ఈ క్రమంలో జగన్ స్పీకర్‌గా ఎవర్ని ఎంపిక చేస్తారోనని అందరిలోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే సీఎం జగన్ మాత్రం ఈసారికి ఉత్తరాంధ్ర వారికి స్పీకర్‌గా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావును స్పీకర్ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక డిప్యూటీ స్పీకర్‌గా రాయలసీమ బీసీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేకు లేదా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేకు అవకాశం కల్పిస్తారని తెలిసింది. అయితే స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎంపికపై ఈ నెల 7వ తేదీన జరిగే వైకాపా శాసనసభా పక్ష సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల చివరి రోజు వైకాపా ప్రభుత్వం రెండు తీర్మానాలను చేయనుంది. ఒకటి.. తమను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసే తీర్మానం కాగా.. మరొకటి.. కేంద్రాన్ని సాయం కోరుతూ చేసే తీర్మానం.. దాంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.