ఏపీ బీపీ : యువ జ‌గ‌న్ కు యువ టీడీపీ పోటీ వ‌చ్చేనా !

-

వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు 40 శాతం సీట్లు ఇస్తామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిన్న‌టి వేళ ప్ర‌క‌టించి మ‌ళ్లీ మ‌ళ్లీ చ‌ర్చ‌కు తావిచ్చేలా మాట్లాడారు. ఇదే స‌మ‌యంలో శ‌ర‌వేగంతో  దూసుకుపోతున్న యువ జ‌గ‌న్ కు య‌వ టీడీపీ కౌంట‌ర్ ఇచ్చేనా ?
ఇదే ఇవాళ్టి ప్ర‌త్యేక క‌థ‌నంలో చర్చ‌నీయాంశం. వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో టీడీపీలో యువ నేత‌ల జోరు ఉంది కాద‌న‌లేం కానీ బాబు ప్రోత్సాహం మాత్రం వారికి లేదు. ఈ కార‌ణంగా వారు అనుకున్న విధంగా రాణించ‌లేక‌పోతున్నారు అన్న‌ది కూడా ఓ వాస్త‌వం. అందుకే గ‌త త‌ప్పిదాల‌ను  దిద్దుకునేందుకు  రాజ‌కీయ వైకుంఠ పాళిలో నిచ్చెన మెట్లు ఎక్కించేందుకు సిద్ధంగా తాను ఉన్నాన‌ని, మీరు కూడా సిద్ధం కావాలి అని చంద్ర‌బాబు నిన్న‌టి వేళ దిశా నిర్దేశం చేశారు.ఇక యువ జ‌గ‌న్ ప్ర‌భావం వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ బాగానే ఉంటుంద‌ని, కానీ ఆయన సిట్టింగ్ ల‌ను మార్చాల్సి ఉంటుంద‌ని ఇప్ప‌టికే కొంద‌రు ఆయ‌న‌కు స‌ల‌హాలు ఇచ్చారు. జ‌గ‌న్ కూడా కొత్త ముఖాల‌ను కొంద‌రిని రంగంలోకి దించి త‌న హ‌వాను కొన‌సాగించాల‌న్న యోచ‌న‌లోనే ఉన్నారు. కొన్ని చోట్ల పాత ప‌ద్ధ‌తుల్లో ఉంటూ, జ‌నాల‌కు దూరంగా ఉంటూ జ‌నామోదం లేని వాళ్లంద‌రినీ, ఆ త‌ర‌హా రాజ‌కీయం న‌డుపుతున్న‌వాళ్లంద‌రినీ మార్చి కొత్త వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని కూడా అనుకుంటున్నారు. అదే జ‌రిగితే టీడీపీకి, వైసీపీకి మ‌ధ్య యుద్ధం భీకరంగా జ‌ర‌గ‌డం ఖాయం.

ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యువ విభాగం ఎప్ప‌టి నుంచో చాలా యాక్టివ్ గా ఉంది. గ్రామాల్లో ఎమ్మెల్యేల‌తో స‌మానంగా ఆ రోజు పరుగులు తీసి పార్టీ కోసం, ఇప్పుడు ప్ర‌భుత్వంకు వ్య‌తిరేకంగా పార్టీ చేప‌ట్టిన ఉద్య‌మాల కోసం ప‌నిచేసిన చ‌రిత్ర ఉంది. వ‌ర్త‌మానం కూడా ఉంది. క‌నుక వీరంతా టిక్కెట్లు ఆశించ‌డం త‌ప్పు లేదు. తెలుగు నాడు విద్యార్థి విభాగం కూడా కీల‌కంగానే ఉంది. యువ‌త, విద్యార్థి విభాగాల  నుంచి కొంద‌రిని ఎంపిక చేస్తే మాత్రం జ‌గ‌న్ కూడా వారికి దీటుగా త‌న నాయ‌క శ్రేణుల‌ను బ‌రిలోకి దింపాల్సి ఉంది. అందుకు యువ జ‌గ‌న్ మ‌రికొంత స‌న్నాహాలు చేయాల్సి ఉంది. ఏదేయిన‌ప్ప‌టికీ మార్పు మంచిదే ! కొత్త ముఖాలు తెర‌పైకి వ‌స్తే జ‌గ‌న్ కూ మంచిదే.,. అదే విధంగా ప్ర‌జ‌ల‌కూ మంచిదే ! ఇదే స‌మ‌యంలో ఏళ్ల త‌రబ‌డి టీడీపీని న‌మ్ముకున్న యువ శ‌క్తుల‌కూ మంచిదే !

Read more RELATED
Recommended to you

Latest news