ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే వైఎస్ జగన్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంవో కార్యాలయంలోని పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎంవో ఆఫీసులో ఉన్న అధికారులను సీఎం జగన్ బదిలీ చేశారు.
సీఎంవో ప్రత్యేక కార్యదర్శి సతీశ్ చందర్, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, కార్యదర్శులు గిరిజా శంకర్, అడుసుమిల్లి రాజమౌళిపై జగన్ బదిలీ వేటు వేశారు. వీరిని సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు. మరోవైపు సీఎం కార్యాలయం అదనపు కార్యదర్శిగా ధనుంజయ్ రెడ్డిని నియమించారు.
జగన్ బదిలీ చేసిన వారంతా చంద్రబాబు టీమ్ అని.. ఆయనకు నమ్మకంగా పనిచేసిన వారని తెలుస్తోంది. సాధారణంగా కొత్త ప్రభుత్వం రాగానే సీఎంవో ఆఫీసులో తమ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేసే వాళ్లనే నియమిస్తారు. వాళ్లకే స్థానం కల్పిస్తారు. ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన జగన్.. వెంటనే సీఎంవో కార్యాలయాన్ని ప్రక్షాళన చేశారు.