ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో మెజారిటి స్థానాలను గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అమరావతి ఉద్యమం నేపధ్యంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో టీడీపీకి కాస్త బలం పెరిగింది. ఇప్పటికే టీడీపీ నేతలు ముఖ్యంగా విజయవాడ మేయర్ పీఠం మీద కన్నేశారు. విజయవాడలో తమకు ఉన్న పట్టు నిలుపుకోవాలి అంటే ఇది చాలా కీలకం.
గత ఎన్నికల్లో కూడా టీడీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేసినేని నానీ రెండో కుమార్తె కేసినేని శ్వేతని ఎంపిక చేసింది తెలుగుదేశం అధిష్టానం. కేసినేని కుటుంబానికి విజయవాడ లో మంచి పట్టు ఉంది. విజయవాడ నాలుగు నియోజకవర్గాల్లో నానీ వర్గం బలంగా ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో భారీగా కేసినేని అభిమానులు ఉన్నారు. ఇక తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న,
గద్దె రామ్మోహన్ కి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా నానీ వర్గం బలంగా ఉంది. బొండా ఉమా ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో స్వల్ప తేడా తో ఓడిపోయారు అంతే. దీనితో టీడీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇక వైసీపీ నుంచి బొప్పన భవ కుమార్ సతీమణిని రంగంలోకి దింపింది అధికార పార్టీ. దీనితో పోరు రసవత్తరంగా మారింది.