బాలయ్య విషయంలో జగన్ ఎందుకు అలా వెళుతున్నారు?

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీల నేతలు ప్రతిరోజూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిందే. అలాగే పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్‌లు కూడా విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. టీడీపీ నేతలు ఏమో వైసీపీపైన, వైసీపీ నేతలు ఏమో టీడీపీపైన విమర్శలు చేయడం సహజమే.

కానీ ఒక్క బాలకృష్ణ విషయంలో మాత్రం జగన్ గానీ, వైసీపీ నేతలుగానీ పెద్దగా విమర్శలు చేయరనే చెప్పొచ్చు. అటు బాలయ్య కూడా రాజకీయాలపై పెద్దగా కామెంట్లు కూడా చేయరు. ఏదో అప్పుడప్పుడు మాత్రం బాలయ్య, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు. దానికి వైసీపీ నేతల నుంచి కూడా పెద్దగా కౌంటర్లు రావు. ఎందుకంటే బాలయ్య పట్ల జగన్ కాస్త అభిమానంతో ఉంటారు కాబట్టే, ఆయనపై పెద్దగా విమర్శలు చేయరని అంటున్నారు.

అయితే బాలయ్య పట్ల జగన్ మెతక వైఖరితో ఉండటం వల్ల హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి కూడా పెద్దగా పట్టు చిక్కడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మామూలుగానే హిందూపురం టీడీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీకి ఇంతవరకు ఓటమి రాలేదు. గత రెండు పర్యాయలుగా ఇక్కడ బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. స్థానికంగా అందుబాటులో లేకపోయినా సరే ప్రజలకు పనులు చేయి పెడుతుంటారు. అందుకే హిందూపురంలో బాలయ్య వీక్ అవ్వడం లేదు. అదే సమయంలో ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఇక్బాల్ సైతం దూకుడుగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. అలా అని జగన్ సైతం హిందూపురంపై స్పెషల్ ఫోకస్ చేసి, అక్కడ బాలయ్యని దెబ్బకొట్టే వ్యూహాలు ఏమి వేస్తున్నట్లు కనిపించడం లేదు. కాబట్టే హిందూపురంలో బాలయ్యకు ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదని అంటున్నారు.