రాజకీయాలు వేరు..సినిమాలు వేరు..కానీ రెండు రంగాలకు లింక్ ఉంటుంది. సినీ రంగంలో ఉండేవారు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన వారు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఏ స్థాయిలో సక్సెస్ అయ్యారో చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ బాటలు వేయడంతో..ఆ బాటలో అనేకమంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు. అలాగే కొందరు నటులు పరోక్షంగా కొన్ని పార్టీలకు మద్ధతుగా ఉంటారు. ఇది జగమెరిగిన సత్యమే.
ఇక సినీ రంగంలో తిరుగులేని నందమూరి ఫ్యామిలీని, టీడీపీని సెపరేట్ గా చూడలేని పరిస్తితి. అలాగే నందమూరి ఫ్యాన్స్ మెజారిటీ టిడిపి వైపే ఉంటారు. అందులో ఎలాంటి డౌట్ ఉండదు. అటు మెగా ఫ్యాన్స్ జనసేన వైపు ఉండటం కామన్. ఇక సినీ రంగంలో కొందరు నటులు వైసీపీకి మద్ధతుగా ఉంటారు. అందుకే సినీ, రాజకీయ రంగానికి లింక్ ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఒక్క వైసీపీ తప్ప మిగిలిన పార్టీలు అరెస్టుని ఖండించాయి. అటు పక్కనే తెలంగాణలో ఉన్న అన్నీ పార్టీల నేతలు ఖండించారు. పార్టీలతో సంబంధం లేకుండా వారు వ్యక్తిగతంగా ఖండిస్తూ వచ్చారు.
ఇక సినీ రంగ అభివృద్ధికి గతంలో చంద్రబాబు బాగా కృషి చేశారని, అందుకే సినీ ఇండస్ట్రీ కూడా స్పందిస్తుందని టిడిపి శ్రేణులు ఆశించాయి. ఏదో కొంతమంది తప్ప..కీలక వ్యక్తులు స్పందించలేదు. ఇటు బాలయ్య, పవన్ అంటే రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి..వారిని పక్కన పెడితే..మిగతా వారు స్పందించలేదు.
అయితే ఎవరిని టిడిపి శ్రేణులు పెద్దగా పట్టించుకోలేదు..కాకపోతే నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ స్పందిస్తారని ఆశించారు. కానీ వారు స్పందించలేదు. ముఖ్యంగా జూనియర్ పైనే తమ్ముళ్ళు ఫోకస్ పెట్టారు. జూనియర్..బాబు అరెస్ట్ గురించి ఏ విధంగానూ రెస్పాండ్ అవ్వలేదు. అంటే తారక్ ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెట్టారు కాబట్టి..ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఇలాంటి వాటిల్లో ఆయన్ని లాగవద్దని జూనియర్ అభిమానులు కోరారు.
అయినా సరే జూనియర్ పేరు పదే పదే ప్రస్తావనకు వస్తూనే ఉంది. తాజాగా బాలయ్య..తెలంగాణ టిడిపి నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో మీడియా..బాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదనే అంశంపై ప్రశ్న అడగగా, ‘ఎవరు స్పందించకపోయినా ఐ డోంట్ కేర్’ అని బాలయ్య సమాధానం ఇచ్చారు. దీంతో బాలయ్యపై జూనియర్ అభిమానులు మండిపడుతున్నారు. బాలయ్య అలా అనడం కరెక్ట్ కాదని అంటున్నారు. అటు బాలయ్య తప్పేమీ అనలేదని, ఎవరు స్పదించినా..స్పందించాకపోయినా తమకు అనవసరమనే రీతిలోనే చెప్పారని, అదేమీ తప్పు కాదని బాలయ్య అభిమానులు అంటున్నారు.
ఇక ఇదే అనువుగా వైసీపీ శ్రేణులు..నందమూరి ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టి..ఎన్టీఆర్ అభిమానులని రెచ్చగొట్టి టిడిపికి యాంటీ చేస్తూ..తమకు మద్ధతు పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే బాబు అరెస్ట్..నందమూరి ఫ్యామిలీలో విభేదాలు రేపింది.