టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలవ్వడంతో..సీన్ మొత్తం మారిపోయింది. రాజకీయంగా టిడిపి సంక్షోభంలో పడింది. ఇక ఆ పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఎవరనే చర్చ సాగుతుంది. బాబు జైలు నుంచి బయటకొచ్చాక పార్టీని భుజాన మోసేది ఎవరని టిడిపి శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. అయితే అంతా లోకేష్ పార్టీని చూసుకుంటారని అంటున్నారు. ఇప్పుడు లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం అవుతుంది.
లోకేష్ సైతం పార్టీ నేతల దగ్గర తాను కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారట. దీంతో టిడిపిలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలయ్య అనూహ్యంగా పార్టీ ఆఫీసుకు వచ్చి నెక్స్ట్ ఏం చేయాలనే అంశాలపై టిడిపి నేతలతో చర్చించారు. ఈయనకు సపోర్ట్ గా యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబు బయటకొచ్చేవరకు టిడిపి బాధ్యతలు బాలయ్య చూసుకుంటారని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా బాలయ్య కూడా ఎవరూ భయపడవద్దని, తాను ముందుండి నడిపిస్తానని చెప్పుకొచ్చారు.
పార్టీ తరపున ఏ కార్యక్రమైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీనియర్ నేతలతో చెప్పారట. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కొందరు టిడిపి కార్యకర్తలు గుండె ఆగి చనిపోయారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చనిపోయిన కుటుంబాలకు తాను అండగా ఉంటానని, త్వరలోనే వారిని పరామర్శిస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు.
ఇక పార్టీ కార్యక్రమాలని తన భుజాన వేసుకుంటారని తెలుస్తోంది. అంటే ఇకపై టిడిపి బాధ్యతలు బాలయ్య తీసుకుంటారని తెలుస్తోంది. అయితే బాబు వచ్చేవరకు బాలయ్య పార్టీలో కీలకంగా వ్యవహరించనున్నారు.