ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆస్పత్రుల సందర్శన

-

తెలంగాణ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు గోస – బీజేపీ పోరు దీక్ష పేరుతో బీజేపీ సోమవారం నిరసన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టగా… ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ నివాసాల్లోనే దీక్ష చేపట్టారు.

కాగా యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, తడిసిన, రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని, తాలు, తరుగు పేరుతో రైతుల్ని వేధించడం ఆపాలని, రైతు రుణమాఫీ అమలు చేయాలని, రైతుబంధు నిధులు విడుదల చేయాలన్న డిమాండ్లతో ఈ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాలు, త‌రుగు, హ‌మాలీల పేరుతో రైతుల‌ను ఇబ్బందులు పెడుతున్నార‌న్నారని అన్నారు. రైతుల‌ను కాపాడాల్సిన బాధ్య‌త సీఎం కేసీఆర్‌కు లేదా? అని ప్ర‌శ్నించారు. చెప్పింది చేయ‌ని.. ఏమీ చేయ‌ని ఏకైక‌ సీఎం కేసీఆరే అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ స‌రిగా జ‌ర‌గ‌డం లేద‌ని, యాసంగి పంట‌ల‌ను వెంట‌నే కొనుగోలు చేయాల‌ని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

రైతులకు ఉచితంగా ఎరువులు, విత్త‌నాల‌ను ఎందుకు ఇవ్వ‌డం లేదని ప్రశ్నించారు. ఓ సారి ఆర్టీసీ కార్మికులు, మ‌రోసారి ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకోసారి నిరుద్యోగులు ఇలా కేసీఆర్ తీరుతో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని మండిపడ్డారు. ధాన్యం అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ ఆసుపత్రుల సందర్శన కార్యక్రమం చేస్తున్నారని, మాటలు తప్ప చేతలు లేని కేసీఆర్.. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తి చేసి, రైతులకు డబ్బులు చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news